
అమ్మో ..3లక్షలా!
కొత్త పాలసీ..
లిక్కర్ షాపు లైసెన్స్ ఫీజు 50శాతం పెంపు
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటిస్తూ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో షాపునకు లైసెన్స్ అప్లికేషన్ ఫీజు రూ.3 లక్షలుగా నిర్ణయించింది. గతంలో ఉన్న రూ.2లక్షల ఫీజుకు 50శాతం అదనపు భారం వేసింది. కొత్త ఎకై ్సజ్ పాలసీ నోటిఫికేషన్‌తో లిక్కర్ యజమానులు, కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునేవారు నిరుత్సాహానికి గురవుతున్నారు.
జిల్లాలో 12 మండలాల పరిధిలో 47 మద్యం దుకాణాలు ఉండగా 2023–25 మద్యం పాలసీ సమయంలో వ్యాపారులు 2,356కు పైగా టెండర్లు దాఖలు చేశారు. ఇందుకు ఎకై ్సజ్ శాఖకు రూ.47.12 కోట్ల మేర ఆదాయం(నాన్ రిఫండబుల్) సమకూరింది. టెండర్ల సమయంలో ఉన్న పోటీ..మద్యం దుకాణాల్లో విక్రయాలు మొదలైన తర్వాత వ్యాపారుల్లో కనిపించలేదు. పెట్టుబడికి తగ్గట్టుగా చాలా చోట్ల వ్యాపారం లేక, నష్టం వచ్చి అమ్మకానికి ముందుకు వచ్చినా ఎవరూ కొనేందుకు సాహసించలేదు. జిల్లాలో నెలకు రూ.20కోట్ల మేర లిక్కర్, బీర్ల అమ్మకాలు జరుగుతుండగా, ఇప్పటివరకు రూ.4వందల కోట్ల వరకు వ్యాపారం జరిగింది.
జనాభా ప్రాతిపదికన లిక్కర్ దుకాణాలకు ఎకై ్సజ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 5వేల జనాభా కలిగిన గ్రామాలకు రూ.50లక్షలు, 5వేల నుంచి 50వేల వరకు రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష వరకు రూ.60లక్షలు, లక్ష నుంచి 5లక్షల వరకు రూ.65లక్షలు, 5 లక్షల నుంచి 20లక్షల వరకు రూ.85లక్షలు, 20లక్షలకు పైగా జనాభా కలిగిన పట్టణాల్లో రూ.1.10కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 2025–27 రెండేళ్ల కాలపరిమితి సమయంలో ఆరు సమాన వాయిదాలతో ఎకై ్సజ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మద్యం దుకాణాల అమ్మ కాల సమయంలో 2023–25 లైసెన్స్ కాలంలో ఉన్న నిబంధనలు తిరిగి అమలుచేయనున్నారు. ప్రస్తుతం దుకాణాల లైసెన్స్ కాలపరిమితి నవంబర్ 30వ తేదీ వరకు ఉండగా, కొత్త పాలసీలో ఒక్కో షాపునకు టెండర్ ఫీజును రూ.3లక్షలకు పెంచడంతో వ్యాపారులు కొంతమేర నిరుత్సాహంగా ఉండగా, మునుపటి మాదిరిగా కొత్తవారు ధైర్యం చేస్తారా అనేదానిపై సందిగ్ధత కనిపిస్తుంది. ఇదిలా ఉండగా నూతన మద్యం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రావాల్సి ఉంది.
నూతన మద్యం పాలసీలో లైసెన్స్ అప్లికేషన్ ఫీజు 50శాతం పెంచుతూ రూ.3లక్షలుగా నిర్ణయించారు. లైసెన్స్ కోసం ఇచ్చే డబ్బులను తిరిగి చెల్లించరు. నూతన లైసెన్స్ కాలపరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది. కలెక్టర్ నేతృత్వంలో మద్యం దుకాణాల కేటాయింపులను లాటరీ ద్వారా కేటాయిస్తారు. లిక్కర్ షాపుల కేటాయింపులు రిజర్వేషన్ల ప్రాతిపదికగా ఉంటాయి. జిల్లాలో 47 మద్యం దుకాణాలకు గాను రిజర్వేషన్ల ప్రకారం గౌడ కులస్థులకు 13 (15శాతం), ఎస్సీ 5(10శాతం), ఎస్టీ 1(5శాతం), జనరల్ కేటగిరీ 28 దుకాణాలుగా గతంలో మాదిరిగానే గుర్తిస్తారు.
నూతన మద్యం పాలసీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
నిరుత్సాహంలో ఆశావహులు
గత మద్యం పాలసీతోనే నష్టాలు
వచ్చాయంటున్న వ్యాపారులు
కొత్త పాలసీలో భారీ ఫీజుతో గిట్టుబాటు కష్టమేనని అభిప్రాయం

అమ్మో ..3లక్షలా!