
నిరక్షరాస్యులకు ఉల్లాస్
మహిళలు చదవడం, రాయడమే లక్ష్యం
జనగామ రూరల్: మహిళలు అక్షరాస్యులుగా ఉంటే కుటుంబం, సమాజం బాగు పడుతుంది. ఇందుకుగాను ప్రభుత్వం మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులైన మహిళలను సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా విద్యాశాఖ, సెర్ప్ అధికారులు సమన్వయంతో ‘ఉల్లాస్’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించారు. అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) పథకాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా దశల వారీగా అమలు చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. గ్రామాల్లో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారు. రెండోదశలో మధ్యలో బడిమానేసిన వారిని గుర్తించి ఓపెన్ స్కూల్ ద్వారా నేరుగా పదో తరగతి చదివిస్తారు. ఆసక్తిని బట్టి ఓపెన్ డిగ్రీ వరకు చదివించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఉపాధి అవకాశాలు కల్పించేలా..
సామాజిక సాధికారతలో భాగంగా ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చదువురాని వారందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ప్రధాన లక్ష్యం. మహిళా సంఘంలోని కొంతమంది మహిళలు సంతకం చేయడం, మరికొంత మంది వేలిముద్ర వేస్తున్నారని ప్రభుత్వం గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల ఆసక్తిని బట్టి ఓపెన్ టెన్త్, డిగ్రీ వరకు చదివించడమే కాకుండా స్కిల్ డెవలప్‌మెంట్, టెక్నికల్ కోర్సుల్లోనూ చేర్పించి ఉపాధి, అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను సైతం నేర్పిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్, డీపీఓ, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. మండల కమిటీలో చైర్మన్‌గా ఎంపీడీఓ, ఎంఈఓ, హెచ్‌ఎం, సీఆర్సీలు సభ్యులుగా కొనసాగుతారు.
మహిళల చదువు.. కుటుంబానికి వెలుగు
మహిళలు అక్షరాస్యులుగా ఉంటేనే ఆ కుటుంబంలో వెలుగులు ప్రసరిస్తాయని, ఇలాంటి కుటుంబాల ద్వారా ఆ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరగడంతోపాటు డ్రాపౌట్స్ తగ్గించి, బాల్య వివాహాలపై అవగాహన పెరుగుతుంది. అక్షరాస్యులుగా మారడంతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన పెరిగి అర్హులందరికీ ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంటుంది.
మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
చదవడం, రాయడం నేర్పించాలనే లక్ష్యంతో ‘ఉల్లాస్’ అమలు చేస్తున్నాం. జిల్లాలోని మహిళా సంఘాల్లోని నిరక్షరాస్యుల వివరాలను గుర్తించేలా గ్రామాల్లో వివరాలు సేకరిస్తున్నాం. నిరక్షరాస్యులు, మధ్యలో బడి మానేసిన వారికి, దివ్యాంగులకు చదవడం, రాయడం నేర్పిస్తారు. నిరక్షరాస్యులైన మహిళలకు ఇది మంచి అవకాశం. సద్వినియోగం చేసుకోవాలి.
– వసంత, డీఆర్‌డీఓ
●
అక్షరాస్యత పెంపునకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి
విద్యాశాఖ, సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహణ
జిల్లాలో 1,29,979 మంది మహిళా సంఘాల సభ్యులు

నిరక్షరాస్యులకు ఉల్లాస్