
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ మూలసూత్రాలను దెబ్బతీసే కుట్రలను చేస్తున్నారని, రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం ఇప్పటికీ భిన్నత్వంలో ఏకత్వంగా ఉండడానికి కారణం అంబేడ్కర్ అందించిన రాజ్యాంగమేనన్నారు. రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రాజ్యాంగం మనల్ని రక్షిస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయాలని, ఓటర్ల జాబితాలో తప్పిదాలపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి చేపడుతున్న పథకాలు అద్భుతమని, దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అంతకుముందు పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్‌కోట్లు, మహిళలకు తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్య, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ ఐలయ్య, పొట్లపల్లి శ్రీధర్‌రావు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, నాయకులు శిరీష్‌రెడ్డి, సీహెచ్.నరేందర్‌రెడ్డి, బెలిదె వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి