
వచ్చుడు..ఇచ్చుడే!
జనగామ రూరల్: తన కుమారులు అక్రమంగా భూమి ఆక్రమించారని, దివ్యాంగుల కింద వచ్చే పింఛన్ రావడం లేదని, కూలిన ఇంట్లో ఉంటున్నామని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని, పట్టా పాస్‌బుక్‌లో ఫొటో తప్పుగా పడిందని ఇలా పలు సమస్యలు పరిష్కారం కావడం లేదని, దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వచ్చుడు.. దరఖాస్తులు ఇచ్చుడే తప్ప పరిష్కారం కావడం లేవని బాధితులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. మొత్తం 58 దరఖాస్తు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని దరఖాస్తులు బాధితులకు తగిన కారణంతో అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. గ్రీవెన్స్‌లో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపిరామ్, ఏఓ శ్రీకాంత్, జిల్లా స్థాయి అధికారులు, పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని ఇలా..
● జనగామ మండలం పెంబర్తి గ్రామానికి చెందిన కె.గీతాంజలి, జనగామ పట్టణంలో 23 వార్డు చెందిన మహమ్మద్ సాజీదాలు అద్దె ఇంట్లో ఉంటున్నామని, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
● జనగామ మండలం పెద్దపహాడ్‌కు చెందిన మోకు అనూష తమకు వారసత్వంగా వచ్చిన భూమిని చట్ట ప్రకారం కూతురు మోకు అక్షరకు చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
● బచ్చన్నపేటలో సర్వే నంబర్లు 176, 178, 177లోని 2.27 ఎకరాల భూమి కొమురయ్య పేరున ఉందని, తనతో పాటు తన కుమారులైన మల్లయ్య, కనకయ్యలకు సర్వే చేపట్టి సమానంగా వచ్చేలా పట్టా చేయాలని కోరారు.
● తమకు కరెంట్ మీటర్లు ఇచ్చి ఆదుకోవాలని జనగామ 12వ వార్డులోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వినతిపత్రం అందించారు.
పరిష్కారం కాని ప్రజాసమస్యలు
ప్రజావాణిలో ఇందిరమ్మ ఇల్లు,
భూసమస్యలే అధికం
వినతులు సత్వరమే పరిష్కరించండి
కలెక్టర్ రిజ్వాన్ బాషా
ప్రజల నుంచి 58 దరఖాస్తులు స్వీకరణ
ఈ ఫొటోలోని వ్యక్తి పాలకుర్తి మండలం గూడూరు పంచాయతీ మొరుసుగడ్డ తండాకు చెందిన బానోత్ లింగ్యా. ఈయనకు నలుగురు కుమారులు ఉన్నారు. లింగ్యాకు ఉన్న 9.30 ఎకరాల భూమిని తన ఇద్దరు కుమారులు వెంకన్న, శ్రీనివాస్‌లు భూమిని సర్వే చేపిస్తామని తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లి అక్రమంగా వారి పేరు మీద పట్టా చేసుకున్నారు. విచారణ చేపట్టి భూమిని తన పేరు మీదకు మార్చి న్యాయం చేయాలని కలెక్టర్‌కు వేడుకున్నాడు.

వచ్చుడు..ఇచ్చుడే!