
ప్రయాణికులు ఫుల్..సౌకర్యాలు నిల్
జనగామ: రాఖీ పండుగ, బోనాల జాతర ముగించుకుని తిరుగు ప్రయాణం వెళ్తున్న ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేవు. రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను నడిపించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 9న రాఖీ, 10న బోనాల జాతర ఉండడంతో దసరాకు మించి ఊళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. పుట్టింటికి చేరుకునే సమయంలో అవస్థలు పడ్డ ఆడపడుచులు, తిరిగి వెళ్లే సమయంలో రెట్టింపు బాధలు పడ్డారు. జనగామ బస్టాండ్‌లో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు బస్సుల కోసం నిరీక్షించే సమయంలో కూర్చునే సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. స్పెషల్ టికెట్ ధరలు పెంచడంలో ఉన్న ఉత్సాహం, ప్రయాణికులకు తగ్గట్టుగా సర్వీసులను నడిపించడంలో ఒక్కశాతం శ్రద్ధ చూపించినా ఇంతటి కష్టాలు ఉండకపోయేవని ప్రయాణికులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
సౌకర్యాలను మెరుగు పరిచేదెప్పుడు?
జనగామ బస్టాండ్‌లో వంద నుంచి రెండు వందల మంది కూర్చునే సౌకర్యం ఉండగా.. వేలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసి పోవడంతో కనీసం నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. బస్సులో సీటు ఏమో కానీ.. కనీసం నిలబడేందుకు కూడా చోటు దక్కించుకునేందుకు ప్లాట్ ఫాంపైకి సర్వీసు రాకముందే ప్రాణాలను ఫణ్ణంగా పెట్టి ఎదురుగా వెళ్లే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో వర్షం రావడంతో కొత్తగా నిర్మాణం చేస్తున్న ప్లాట్ ఫాంతో పాటు పాలకుర్తి రూట్ బస్సులు ఆగే ప్రదేశం, శ్రీసీతారామాంజనేయ ఆలయం వద్ద తలదాచుకున్నారు. జనగామ జిల్లాగా ఆవిర్భవించి 11 సంవత్సరాలు గడిచినా.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హెడ్ క్వార్టర్‌లోని బస్టాండ్‌లో సౌకర్యాల కల్పనను దృష్టి సారించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
సీటు కోసం కోటి కష్టాలు
వానొస్తే నరకమే..
తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు కష్టాలు
బస్సుల కోసం బస్టాండ్‌లో నిరీక్షణ

ప్రయాణికులు ఫుల్..సౌకర్యాలు నిల్