ముందస్తు బియ్యం వచ్చేశాయ్
జనగామ: రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం వచ్చే మూడునెలల కోటా ఒకేసారి పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్షాకాలం నేపథ్యంలో బియ్యం రవాణాలో తలెత్తే సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యాన అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ పర్యవేక్షణలో పౌరసఫరాల శాఖ జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించిన సన్న బియ్యం కోటాను జూన్ ఒకటో తేదీ నుంచి పంపిణీకి చర్యలు చేపట్టింది.
వర్ష్షాకాలంతో అప్రమత్తం..
వర్షాకాలంలో ఏటా దేశంలోని అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో ముందస్తు రేషన్ సరుకులు పంపి ణీ చేయడం గతం నుంచే కొనసాగుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టులు, చెరువు కట్టలు, మట్టి రహదారులు కోతకు గురై రవాణా వ్యవస్థ స్తభించి పోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ కేంద్రం రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేస్తున్నది. అయితే ఈసారి మాత్రం దేశంలోని అన్ని ప్రాంతాల్లో మూడు నెలలకు సంబంధించిన సరుకులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది.
5,35,689 మంది లబ్ధిదారులు
జిల్లాలో 1,63,283 రేషన్ కార్డులు ఉండగా.. 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. లబ్ధిదారులు 5,35,689 మంది ఉండగా.. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 30,049 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మూడు నెలలకు సరిపడా 90,147 క్వింటాళ్ల సన్న బియ్యం రేషన్ దుకా ణాలకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 195 దుకాణాలకు 20వేల క్వింటాళ్ల సన్న బియ్యం తరలించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు వందశాతం కోటా పంపించేలా ట్రాన్స్‌పోర్టేషన్‌ను సిద్ధం చేశారు.
పంపిణీ నిబంధనల సడలింపు
రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలల కోటా సన్న బియ్యం ఒకేసారి తీసుకువెళ్లేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నా రు. గతంలో 18వ తేదీ వరకు బియ్యం తీసుకుపోయే అవకాశం ఉండగా.. ఈసారి జూన్ 30వ తేదీ వరకు పంపిణీ చేసేలా నిబంధనలను సడలించారు.
జూన్ 10 వరకు
వందశాతం కోటా..
జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేయబోతున్నాం. ఇప్పటి వరకు 195 రేషన్ దుకాణాలకు బియ్యం వచ్చాయి. 10వ తేదీలోగా అన్ని దుకాణాలకు వందశాతం కోటా వెళ్తుంది. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– హథీరామ్, సివిల్ సప్లయీస్ డీఎం
జిల్లాలో రేషన్ వివరాలు
రేషన్ దుకాణాలు: 335
రేషన్ కార్డులు: 1,63,283
లబ్ధిదారులు: 5,35,689
నెలవారీ కోటా: 30,049 క్వింటాళ్లు
మూడు నెలల కోటా ఒకేసారి
రేపటి నుంచి పంపిణీ షురూ
195 దుకాణాలకు చేరిన సన్న బియ్యం
జూన్ 10వ తేదీ వరకు వందశాతం..
30వ తేదీ వరకు పంపిణీకి అవకాశం
వర్షాకాలం నేపథ్యంలో నిర్ణయం


