సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
జనగామ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు మరోసారి బయటపడింది. నాగపురి –కొమ్మూరి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు తోపులాడుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద సోమవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో రూ.10లక్షల విలువ చేసే 24 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసే సమయంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి వర్గీయులు అడ్డుకున్నారు. జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ప్రోటోకాల్, అనుమతి లేకుండా కిరణ్ చెక్కులను పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట, ఒకరిపై ఒకరు చేయి వేసుకునే వరకు వెళ్లింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురిని సముదాయించి పంపించారు. చెక్కులను పంపిణీ చేసేందుకు నాగపురి కిరణ్ తన వర్గీయులతో కలిసి సిద్ధిపేటరోడ్డు గాయత్రి గార్డెన్‌కు చేరుకున్నారు. డీసీసీ అధ్యక్షులు లేకుండా చెక్కులను ఎక్కడా పంపిణీ చేయొద్దని కొమ్మూరి వర్గీయులు వచ్చి అడ్డుకున్నారు. పార్టీ పౌరు తీస్తున్నారంటూ కొమ్మూరి అనుచరవర్గం కిరణ్ వర్గంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అరగంటపాటు మాటల యుద్ధంతో కొట్టుకున్నంత పని చేశారు. ఏఎస్పీ చేతన్ నితిన పండేరీ ఆధ్వర్యంలో సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సైలు.. నాగపురి కిరణ్ కు మార్‌గౌడ్‌తోపాటు కొమ్మూరి వర్గీయులను అక్కడ నుంచి పంపించారు. అనంతరం షామీర్‌పేటలోని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గనిపాక మహేందర్ నివాసం వద్ద కిరణ్ చెక్కులను పంపిణీ చేశారు.
నాగపురి వర్సెస్ కొమ్మూరి వర్గం
ఇరు వర్గాల మధ్య తోపులాట
ఉద్రిక్తత, పోలీసుల రంగ ప్రవేశం


