చలికి జాగ్రత్తలే రక్ష
జనగామ: చలి తీవ్రతతో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు అన్నారు. సాధారణ జలుబు, ఫ్లూ (ఇన్‌ఫ్లుయెంజా), అస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా వంటి ఇన్ఫెక్షన్లు చలికాలంలో వైరస్‌లు ఎక్కువసేపు జీవించడం, మూసివేసిన గదుల్లో వేగంగా వ్యాపించగలగడం వల్ల విస్తరిస్తాయన్నారు. శ్వాససమస్యలతో పాటు చలి ప్రభావం చర్మం, కీళ్లనొప్పులపై ప్రభావం ఉంటుందన్నారు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో కూడా ప్రమాదం అధికమవుతుందన్నారు. చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నివారణ చర్యలే ప్రధానమని సూచించారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ‘సాక్షి ఫోన్ ఇన్’లో డీఎంహెచ్‌ఓ సూచించారు. అలాగే జిల్లా ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంజీవరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అశోక్ కుమార్, పల్మనాలజిస్టు డాక్టర్ దివ్య ప్రజలకు ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించారు.
ప్రశ్న: జిల్లా ఆస్పత్రిలో పిల్లల ఓపీ ప్రారంభించాలి. కుక్క, కోతి కాటుకు ఇక్కడే వ్యాక్సిన్ ఇవ్వాలి..
– సుంచు శ్రీకాంత్, గుండ్లగడ్డ, జనగామ
డీఎంహెచ్‌ఓ: కుక్క, కోతి కాటుతో పిల్లలు తీవ్రంగా అనారోగ్యానికి గురైన సమయంలో పీడీయాట్రిక్ వైద్యులు మాత్రమే వ్యాక్సినేషన్ ఇవ్వాలి ఉంటుంది. ఈ సేవలు ఎంసీహెచ్‌లోనే ఉన్నాయి.
ప్రశ్న: సీజనల్‌గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. తుమ్ములు ఆగడం లేదు, షుగర్ ఉన్నవారు ఏం చర్యలు తీసుకోవాలి?
– పార్సి రంగారావు,శివునిపల్లి, సాయి మనోజ్ కుమార్, కొడకండ్ల, ఈగ కృష్ణమూర్తి, కూనూరు, జఫర్‌గఢ్, టి.రామకృష్ణ, స్టేషన్‌ఘన్‌పూర్, ఏదునూరి వీరన్న, లింగాలఘణపురం, మంతపురి యాదగిరి, కన్నాయపల్లి, ఆరూరి జయప్రకాష్, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ రఘునాథపల్లి
డీఎంహెచ్‌ఓ: చలికాలంలో ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, అస్తమా తిరగబెట్టడం, న్యూమోనియా వంటి కేసులు వస్తాయి. వీరు చలికి ఎక్స్‌పోజ్ కావద్దు. ముఖానికి మాస్క్, ఉన్ని దుస్తులు ధరించాలి. తుమ్ములు సైనస్‌కు కారణం కావచ్చు. జిల్లా ఆస్పత్రిలో పల్మనాలజిస్టు, ఈఎన్‌టీ స్పెషలిస్టులు సైతం అందుబాటులో ఉంటారు. అక్కడ పరీక్ష చేయించుకోండి. షుగర్, బీపీ పేషెంట్లు మందులను కంటిన్యూ చేయాలి.
ప్రశ్న: నా భార్యకు ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించిన తర్వాత గ్యాస్ ఫాం అవుతోంది? ఏం చేయాలి?
– శివానందమూర్తి, ఇప్పగూడెం
డీఎంహెచ్‌ఓ: నీరు తొలగించే సమయంలో యాంటీబయోటిక్స్ ఇవ్వడంతో కొంతమేర గ్యాస్ సమస్య ఉంటుంది. తినలేకపోతారు. వాంతులు కావడం సహజమే. పులుపు, కారం, తినకూడదు.
ప్రశ్న: మరిగడిలో హెల్త్ క్యాంపులు నిర్వహించండి
– ఎడ్ల శ్రీనివాస్, అడ్వకేట్, మరిగడి, జనగామ
డీఎంహెచ్‌ఓ: మరిగడి (ఎం) తండాలో ఎంబీబీఎస్ డాక్టర్ పర్యవేక్షణలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం.
ప్రశ్న: 24 గంటల పాటు డాక్టర్లు అందుబాటులో ఉండాలి..ఊరిలో పదిలో ఇద్దరికి జ్వరాలు ఉన్నాయి.. – శివరాజ్, జఫర్‌గఢ్
డీఎంహెచ్‌ఓ: జఫర్‌గఢ్ హాస్పిటల్‌లో 24 గంటలు సేవలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఇంకా ఎక్కువగా దృష్టి సారిస్తాం. ఇంటింటా ఫీవర్ సర్వే చేయిస్తాం. మందులు సరిపడా ఉన్నాయి.
ప్రశ్న: డీహెచ్, ఎంసీహెచ్‌లో తాగునీరు ఏర్పాటు చేయండి, కుక్క తీవ్రంగా కరిస్తే ఎంజీఎంకు రెఫర్ చేశారు..
– మంతెన మణి, అమ్మఫౌండేషన్, జనగామ
డీఎంహెచ్‌ఓ: జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి రెండు చోట్ల తాగునీరు వసతి కల్పించే విధంగా చూస్తాం. కుక్క తీవ్రంగా కరిచిన సమయంలో ఇచ్చే వ్యాక్సిన్ ఎంజీఎంలో అందుబాటులో ఉండడంతోనే అక్కడకు పంపించారు.
ప్రశ్న: బచ్చన్నపేటలో పిల్లల డాక్టర్ ఉండడం లేదు.. జనగామకు తీసుకెళ్తున్నాం..
– రాంరెడ్డి, ఇటికాలపల్లి, రమేశ్, బచ్చన్నపేట
డీఎంహెచ్‌ఓ: బచ్చన్నపేట సీహెచ్‌సీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ చిన్న పిల్లల వైద్యులు. నిత్యం అందుబాటులో ఉండే విధంగా చూస్తాం.
ప్రశ్న: చర్మవ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి
– పులి ధనుంజయ్‌గౌడ్, ఉప్పుగల్లు, జఫర్‌గఢ్
డీఎంహెచ్‌ఓ: చలితీవ్రతతో చర్మం పొడిగా మారి పగుళ్లు బారుతుంది. కొబ్బరి నూనె, వ్యాస్‌లేన్ ఉపయోగిస్తే సరిపోతుంది.
ప్రశ్న: ఎక్స్‌రే టెక్నీషియన్, ఈసీజీ, 2–డీ ఎకో సేవలు కావాలి – నగేష్, కూనూరు
డీఎంహెచ్‌ఓ: జఫర్‌గఢ్ సీహెచ్‌సీలో ఎక్స్‌రే మిషన్ ఉంది. టెక్నీషియన్ లేడు. ప్రపోజల్ పంపించాం.. రెండు,మూడు నెలల్లో రావొచ్చు.
చలి తీవ్రత దృష్ట్యా ఉన్నిదుస్తులు, మాస్క్ ధరించాలి
శ్వాస, చర్మ, కీళ్లు, గుండె జబ్బులు ఉన్నవారిపై ప్రభావం ఎక్కువ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నాం..
‘సాక్షి ఫోన్ ఇన్’లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్‌రావు
చలికి జాగ్రత్తలే రక్ష


