సమస్యలకు పరిష్కారమేది?
జనగామ రూరల్: వృద్ధాప్యంలో అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నామని పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని వృద్ధురాలు, తనకు తల్లిదండ్రులు లేరని ఉండడానికి సొంత ఇల్లు లేదని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని యువతి..ఇలా పలు సమస్యలతో సోమవారం గ్రీవెన్స్‌కు ప్రజలు తరలివచ్చారు. ఏళ్ల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నామని దూరప్రాంతాల నుంచి ఖర్చు పెట్టుకోని వచ్చి దరఖాస్తులు ఇవ్వడమే అవుతోందని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ లు పింకేశ్ కుమార్, బెన్‌షాలోమ్ ప్రజల నుంచి 31 దరఖాస్తులు స్వీకరించారు.
దరఖాస్తులు కొన్ని ఇలా..
● జనగామ పట్టణానికి చెందిన మేకల ప్రశాంత్ అనే వ్యక్తి, తన భూమి విషయంలో జరిగిన అక్రమ పేరు నమోదుపై ఫిర్యాదు చేశారు. డాక్యుమెంట్లను పరిశీలించి, అక్రమంగా నమోదైన వారి పేర్లను రెవెన్యూ రికార్డుల నుండి తొలగించాలని వినతి పత్రం అందజేశారు.
● పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన బక్క కవిత అనే మహిళ తమకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించమని దరఖాస్తు చేసుకుంది.
● బచ్చన్నపేట మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన చిమ్మ అండమ్మ తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, పెద్ద కుమారుడు తన బాగోగులు చూస్తుండగా చిన్న కుమారుడు చూడడం లేదని వినతిపత్రం అందించింది.
● రఘునాథపల్లి మండలం గోవర్థనగిరి గ్రామానికి చెందిన శివరాత్రి కల్పన అనే మహిళ ఇటీవల తన భర్త మృతి చెందాడని భర్త పేరు మీద ఉన్న భూమి తన పేరుమీద పట్టా చేయాలని వినతి పత్రం అందించింది.
● నర్మెట మండలం బొమ్మకూర్ గ్రామానికి చెందిన మాలోతు కవిత తన తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారని, ఉండడానికి ఇల్లు లేకపోవడంతో తన నానమ్మతో కలిసి ఉంటున్నానని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరింది.
● జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో చెట్లు ఏపుగా పెరిగి రాత్రివేళల్లో పాములు, క్రిమికిటకాలు ఇండ్లులోకి వస్తున్నాయని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు హరీశ్, మహేందర్ వినతి పత్రం అందజేశారు.
కలెక్టరేట్ చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నాం..
గ్రీవెన్స్‌లో ప్రజల ఆవేదన


