
భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం
స్టేషన్‌ఘన్‌పూర్: భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్‌బాషా అన్నారు. భూభారతి చట్టం అమలు నేపథ్యంలో జిల్లాలో పైలట్ మండలం స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో భాగంగా రెండో రోజు మంగళవారం మండలంలోని రాఘవాపూర్, తానేదార్‌పల్లి గ్రామాల్లో సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్‌బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి రెండు గ్రామాల్లో సదస్సుల నిర్వహనతీరును పరిశీలించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులతో భూసమస్యలపై అవగాహన వస్తుందన్నారు. మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 13వ తేదీ వరకు సదస్సులు ఉంటాయని, భూ సమస్యలు ఉన్నవారు సదస్సులలో పాల్గొని దరఖాస్తులను సమర్పించాలన్నారు. గతంలో ప్రజలు తహసీల్దార్, ఆర్‌డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం అధికారులే గ్రామాల్లోకి వచ్చి ప్రజలనుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారన్నారు. భూరికార్డుల్లో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూసమస్యలు, సర్వే నంబర్ల మిస్సింగ్, పట్టా పాసుబుక్కులు లేకపోవడం, సాదాబైనామా, హద్దుల నిర్ధారణ తదితర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి నిర్ధేశిత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్‌నాయక్, ఆర్‌డీఓ వెంకన్న, తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పారదర్శకంగా అందించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: రేషన్ బియ్యం పారదర్శకంగా అందించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా ఆదేశించారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని రేషన్‌షాపును, శివునిపల్లిలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టాక్ నిల్వలను, స్టాక్ బోర్డులు, బయోమెట్రిక్ ఈపాస్ యంత్రాలను పరిశీలించారు. ప్రజలకు పారదర్శకంగా రేషన్ అందుతుందా, పంపిణీపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అనే విషయమై క్షేత్రస్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలోని తానేదార్‌పల్లి గ్రామంలోకి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తుందన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు శ్రీకాంత్, సతీష్ తదితరులున్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
రెండోరోజు రాఘవాపూర్,
తానేదార్‌పల్లిలో రెవెన్యూ సదస్సులు