
ఎక్కడి సమస్యలు అక్కడే..
జనగామ రూరల్: సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కన్నీటితో వేడుకున్నా.. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపోయారు. పది నెలల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నామని పార్ట్ టైం సిబ్బంది, కుమారులు తిండి పెట్టడం లేదని వృద్ధ దంపతులు, వితంతు, దివ్యాంగ పింఛన్ రావడం లేదని, కాల్వ కింద భూమి పోతే నష్టపరిహారం రాకుండా అడ్డుకున్నారని ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు పలువురు వినతులు సమర్పించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ ప్రజల నుంచి 60 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికై అన్ని మండలాల సంబంధిత తహసీల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తగిన చర్యలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, డీఆర్‌డీఓ వసంత, డీపీఓ స్వరూప, జిల్లా పౌరసరఫరాల అధికారిణి సరస్వతి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీఏఓ రామారావు నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● పాలకుర్తి మండలం, ముత్తారం గ్రామానికి చెందిన కె.మంగమ్మ, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా తమ పేరు మంజూరు జాబితాలో లేదని, తమకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు.
● దేవరుప్పుల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన తోరిపూరి రాములు తన 1.2 ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని, వారిపై తగిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
● లింగాలఘణపురం మండలం, కళ్లెం గ్రామానికి చెందిన ఆరె లక్ష్మీనర్సమ్మ తమ నలుగురు కుమారులు ఆస్తి మొత్తాన్ని వారి పేరు మీద చేసుకున్నారు. ఇప్పుడు తమను పోషించడం లేదని వినతిపత్రం సమర్పించారు.
● జిల్లా కేంద్రంలోని 11వ వార్డుకు చెందిన బిర్రు మల్లేష్ 15 ఏళ్లుగా కిరాయికి ఉంటున్నారని, తనకు వీవర్స్ కాలనీలో 100 గజాల స్థలం ఉందని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతి అందజేశారు.
● జనగామ పట్టణానికి చెందిన బడికే శ్రీకాంత్‌కు దివ్యాంగ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నాడు.
కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు
సమస్యలు పరిష్కారం కావడం లేవని మండిపాటు
అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా
గ్రీవెన్స్‌కు 60 వినతులు
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ నర్మెట మండలం అమ్మపురానికి చెందిన వైద్యం సునీత, భర్త రాజ్‌కుమార్ నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలు. రోజూ జనగామకు వచ్చి హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. తమది పేద కుటుంబమని, గ్రామంలో ఇల్లు కూడా లేదని, వితంతు పెన్షన్ మంజూరు చేస్తే ఆసరాగా ఉంటుందని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది.
పక్క ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగుడు చిల్పూర్ మండలం శ్రీపతిపల్లికి చెందిన చెట్టబోయిన వెంకటకిష్టయ్య. ఈయనకు నలుగురు కుమారులు ఉండగా తనకున్న పది ఎకరాల భూమిని నాలుగు సమాన భాగాలుగా ఇచ్చాడు. ప్రస్తుతం చిన్న కుమారుడి ఇంటి వద్ద ఉంటున్నాడు. నలుగురు కుమారులు ఉన్నా.. తనను చూసుకోవడం లేదని, గతంలో ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే పెద్ద మనుషుల సమక్షంలో నెలకు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
గ్రామంలో తమకు ఎలాంటి ఆస్తులు లేవు. భార్యభర్తలు ఇద్దరం దివ్యాంగులం. ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకోగా అర్హులకు కాకుండా అనర్హుల పేర్లు వచ్చాయి. దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యతగా ఇల్లు మంజూరు చేయాలి.
– వాతాల యాదగిరి, దివ్యాంగుడు, నిడిగొండ
నష్టపరిహారం రాకుండా అడ్డుపడుతున్నారు..
దేవాదుల కాల్వ కింద 29 గుంటల భూమి పోయింది. ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.10లక్షలు మంజూరయ్యాయి. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నారు. అధికారులు విచారణ జరిపి నష్టపరిహారం ఇప్పించాలి.
– అరకల రజిత, జఫర్‌గఢ్

ఎక్కడి సమస్యలు అక్కడే..

ఎక్కడి సమస్యలు అక్కడే..

ఎక్కడి సమస్యలు అక్కడే..

ఎక్కడి సమస్యలు అక్కడే..