‘నీట్‌’కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’కు సర్వం సిద్ధం

May 3 2025 7:42 AM | Updated on May 3 2025 7:42 AM

‘నీట్‌’కు సర్వం సిద్ధం

‘నీట్‌’కు సర్వం సిద్ధం

రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష

582 మంది విద్యార్థులు..

రెండు సెంటర్లు

అరగంట ముందే గేట్లు క్లోజ్‌

అడ్మిట్‌ కార్డు, ఐడీ ఉంటేనే అనుమతి

సీసీ కెమెరాల నిఘా..

మూడంచెల భద్రత

ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్‌

జనగామ: నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌–2025) ఈ నెల 4న నిర్వహించడానికి జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో పరీక్ష నిర్వహణపై కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంబీబీఎస్‌తో పాటు బీడీఎస్‌, బీఎస్‌ ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాని కి నిర్వహించే ఈ పరీక్ష కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెనీ(ఎన్‌టీఏ) అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నీట్‌ యూజీ అధి కారిక వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ సహాయంతో అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

రెండు సెంటర్లు.. 582 మంది విద్యార్థులు

జిల్లాలో ‘నీట్‌’ నిర్వహణకు రెండు సెంటర్లను కేటాయించారు. మొత్తం 582 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. పట్టణంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌లో 504 మంది, పెంబ ర్తి ఎంజేపీ గురుకులం సెంటర్‌లో 78 మంది విద్యార్థులను కేటాయించారు. కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా పర్యవేక్షణలో చీఫ్‌సూపరింటెండెంట్ల ఆధ్వర్యాన 49 మంది ఇన్విజిలేటర్లు ‘నీట్‌’ విధులు నిర్వర్తించనున్నారు. డీసీపీ రవీంద్రనాయక్‌ నేతృత్వంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఎన్‌టీఏ, జిల్లా అబ్జర్వర్ల పర్యవేక్షణ ఉంటుంది.

బయోమెట్రిక్‌.. సీసీ కెమెరాల నిఘా

ఎన్‌టీఏ పర్యవేక్షణలో సీసీ కెమెరాల నిఘా మధ్య ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించే ‘నీట్‌’ పరీక్ష కోసం మధ్యాహ్నం 1.30 గంటల లోపు వచ్చిన విద్యార్థులను మాత్రమే సెంటర్‌లోకి అనుమతిస్తారు. అడ్మిట్‌ కార్డు, ఐడీ కార్డు తప్పనిసరి వెంట తెచ్చుకోవాలి. విద్యార్థులు సెంటర్‌లోకి వెళ్లిన తర్వాత బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది.

వీటికి అనుమతి లేదు

పరీక్ష కేంద్రంలోకి డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్‌, ఎలక్ట్రానిక్‌, ఇతర వాచ్‌లు, నిబంధనలకు లోబడిన వివిధ ఆభరణాలు, కర్చీఫ్‌ తదితరాలకు అనుమతి లేదు. ఇదిలా ఉండగా పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ల బాధ్యతలు, విధులపై నేడు(శనివారం) సెంటర్‌ చీఫ్‌ సూపరింటెండెంట్ల ఆధ్వర్యాన అవగాహన కల్పించి, ఐడీ కార్డులు అందజేయనున్నారు.

పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్‌

జిల్లాలో ‘నీట్‌’ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా తెలిపారు. సమీక్షలో ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులు 1.30 గంటల లోపు హాజరు కావాలన్నారు. ఆ తర్వాత వచ్చిన వారిని లోనికి అనుమతించరని, అడ్మిట్‌, ఐడీ కార్డులు లేకుంటే పరీక్షకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అబ్జర్వర్‌ గౌసియాబేగం, సిటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నర్సయ్య, చీఫ్‌ సూపరింటెండెంట్లు రవీందర్‌నాయక్‌, అనిత తదితరులు పాల్గొన్నారు.

పటిష్ట బందోబస్తు: సీపీ

వరంగల్‌ క్రైం: కమిషనరేట్‌ పరిధిలో ఈనెల 4న(ఆదివారం) జరిగే నీట్‌ ప్రవేశ పరీక్ష కేంద్రా ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి లో మొత్తం 13 పరీక్ష కేంద్రాలున్నాయని, ఇందులో వరంగల్‌, హనుమకొండలో 11, జనగా మలో 2 పరీక్ష కేంద్రాలున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలు, ధర్నాలు, గుంపులుగా తిరగడం నిషేధమని, పరీక్ష పరిసరాల్లో జిరాక్స్‌ సెంటర్లు మూసేయాలని ఈ సందర్భంగా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement