ఆదర్శ నియోజకవర్గమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ నియోజకవర్గమే లక్ష్యం

Apr 21 2025 8:01 AM | Updated on Apr 21 2025 8:01 AM

ఆదర్శ నియోజకవర్గమే లక్ష్యం

ఆదర్శ నియోజకవర్గమే లక్ష్యం

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్‌ఘన్‌పూర్‌: నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని, నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో రూ.15 కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కడియం, ఎంపీ కడియం కావ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు చెవుల యాదగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. కొత్తపల్లి క్రాస్‌ రోడ్డు జాతీయ రహదారి నుంచి కొత్తపల్లి, తాటికొండ, జిట్టెగూడెం గ్రామాల మీదుగా మల్లన్నగండి రూ.15 కోట్లతో రోడ్డు వెడల్పు, బీటీ రోడ్డు పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో కొత్తపల్లి గ్రామస్తులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదలకు సన్నబియ్యం, రైతులకు సన్నబియ్యానికి బోనస్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మూర్ఖులు చేస్తున్న విమర్శలు పట్టించుకోనని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఓ ప్రబుద్దుడు అభివృద్ధిలో నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించాడని, తినడం, తాగడం, ఊగడం, వాగడమే పనిగా ఉన్నాడని పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో వెనుకబడిన నియోజకవర్గాన్ని ప్రస్తుతం ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి రూ.800 కోట్లు మంజూరీ చేయించి స్వయంగా సీఎంచే శంకుస్థాపన చేయించిన ఘనత కడియందే అన్నారు. కొత్తపల్లి గ్రామానికి తన ఎంపీ నిధుల నుంచి మహిళా కమ్యూనిటీ భవనం, హైమాస్‌ లైట్లకు నిధులు మంజూరీ చేస్తానని హామీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాంబాబు, ఏఎంసీ చైర్‌పర్సన్‌ లావణ్యశిరీష్‌రెడ్డి, నాయకులు కీసర ముత్యంరెడ్డి, యాదగిరి, మధుసూదన్‌రెడ్డి, శిరీష్‌రెడ్డి, నరేందర్‌గౌడ్‌, శివచరణ్‌రెడ్డి, ఆనందం, రాజు, వెంకటస్వామి, కుమారస్వామి, రవి, రాజ్‌కుమార్‌, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement