‘కుడా’కు కావాలి ఓ ఐఏఎస్!
సాక్షిప్రతినిధి, వరంగల్:
గ్రేటర్ వరంగల్.. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండో నగరం. రాష్ట్ర రాజధానికి సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం, మంత్రులు పదే పదే చెబుతున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) ద్వారా మహా నగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని కూడా ప్రకటించారు. అయితే.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలంటే ‘కుడా’కు ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తేనే సాధ్యమన్న చర్చ జరుగుతోంది. 1982 నుంచి సుమారు 25 మందికిపైగా అధికారులు ‘కుడా’ వైస్ చైర్మన్లుగా పని చేశారు. కొందరు వైస్ చైర్మన్‌తో పాటు వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా కూడా వ్యవహరించారు. అయితే 2009, 2011లో ప్రత్యేకంగా ‘కుడా’ వైస్ చైర్మన్లను నియమించిన ప్రభుత్వం.. ఆతర్వాత పూర్తి కాలపు వీసీలను నియమించలేదు. 2009 నవంబర్ 12న జక్కుల శంకరయ్యను ‘కుడా’ వీసీగా నియమించగా, ఆ తర్వాత 2013–14లో యాదగిరిరెడ్డి కొంతకాలం పని చేశారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్‌లే.. ‘కుడా’ వైస్ చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు.
కమిషనర్లే ఇన్‌చార్జ్ వీసీలు
2013–14 తర్వాత సుమారు పదకొండేళ్ల నుంచి ‘కుడా’కు పూర్తి కాలపు వైస్ చైర్మన్లను ప్రభుత్వాలు నియమించలేదు. యాదగిరిరెడ్డి తర్వాత ఐఏఎస్ అధికారులు పౌసమి బసు, ప్రశాంత్ జీవన్ పాటిల్, సర్ఫరాజ్ అహ్మద్ వరుసగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్లుగా, ‘కుడా’ వైస్ చైర్మన్లుగా పని చేశారు. ఆతర్వాత ఎస్.దయానంద్ తర్వాత శృతిఓజా, వీపీ గౌతమ్, పమేలా సత్పతి, ప్రావీణ్య, రిజ్వాన్‌బాషా మొదలు ప్రస్తుతం ఉన్న అశ్విని తానాజీ వాకడే వరకు ఐఏఎస్‌లే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లుగా, ఇన్‌చార్జ్ వీసీలుగా ఉన్నారు. 2016లో జిల్లాల పునర్విభజన తర్వాత ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న జిల్లాకు కూడా కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు విస్తరించిన ‘కుడా’కు పూర్తికాలపు వైస్‌చైర్మన్ ఐఏఎస్ అధికారిని నియమించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
ప్రత్యేక ఐఏఎస్ ఉంటే మేలు
మూడు జిల్లాలకు విస్తరించిన ‘కుడా’ పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులపై ప్రభుత్వం హామీలు ఇచ్చింది. సుమారు రూ.10 వేల కోట్ల పనులకు సమర్పించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
● జీఎంఆర్ నిరభ్యంతర పత్రంతో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 750 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా.. మరో 450 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. కాకతీయ మెగా జౌళి పార్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,200 ఎకరాల భూసేకరణ చేసి, టీజీఐఐసీ ద్వారా మౌలిక వసతులు కల్పించింది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు పని మొదలు పెట్టినా.. కేంద్రం నుంచి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు రాబట్టేందుకు ’ఎస్‌పీవీ’ (ప్రత్యేక ప్రయోజన వాహకం) ఏర్పాటు చేయడంతో పాటు రూ.500 కోట్ల మంజూరుపై చర్చ జరుగుతోంది.
● ఓరుగల్లుకు కీలకమైన స్మార్ట్‌సిటీ పథకం ద్వారా రూ.941.53 కోట్లతో 47 పనులకు నిధులు మంజూరు చేశారు. 28 పనులు పూర్తవగా.. 19 కొనసాగుతున్నాయి. స్మార్ట్‌రోడ్లు అసంపూర్తిగా ఉండడం, భద్రకాళి, వడ్డేపల్లి, ఉర్సు చెరువు బండ్ సుందరీకరణ పనులు.. నిధులు, పర్యవేక్షణ లేక జాప్యమవుతున్నాయి.
● గ్రేటర్ వరంగల్‌కు ఓ మంచి డంపింగ్ యార్డు లేదు. రోజూ 480 టన్నుల చెత్త పోగవుతున్నా.. డంపింగ్ చేసేందుకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లతో ప్రతిపాదించారు.
● మహా నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వంలో రూ.669.59 కోట్ల అంచనా వ్యయంతో పనులకు శంకుస్థాపన చేశారు. భూసేకరణ కోసం రూ.157.95 కోట్లు కేటాయించగా.. రహదారి నిర్మాణం కోసం రూ.551.64 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే సరిపడా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.
● వరంగల్ నగర అభివృద్ధి కీలకమైన 2041 మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించిన ‘కుడా’ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడానికి పూర్తి కాలపు ఐఏఎస్ అధికారి వీసీగా లేకపోవడమేనన్న చర్చ కూడా జరుగుతోంది.
ఐఏఎస్‌ను వీసీగా నియమించాలి
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వరంగల్(కుడా)కు బల్దియా కమిషనర్‌ను వీసీగా నియమించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇన్‌చార్జ్ వీసీ పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ‘కుడా’కు ఐఏఎస్ స్థా యి అధికారిని వీసీగా నియామకం చేయాలి.
– అచ్చ వినోద్‌కుమార్,
సామాజిక న్యాయవేదిక జిల్లా కార్యదర్శి
రెగ్యులర్ వీసీని నియమించాలి
అభివృద్ధిలో హైదరాబాద్‌తో పోటీపడుతున్న వరంగల్ మహా నగరం మరింత ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చెందాలంటే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు సీనియర్ ఐఏఎస్ అధికారిని రెగ్యులర్ వైస్‌చైర్మన్‌గా నియమించాలి. ఇప్పటి వరకు ఇన్‌చార్జ్ వీసీలుగా మున్సిపల్ కమిషనర్, కలెక్టర్లను ప్రభుత్వం నియమిస్తూ వస్తున్నది. తద్వారా ‘కుడా’ అభివృద్ధికి ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నారు. సీనియర్ ఐఏఎస్‌ను వైస్‌చైర్మన్‌గా నియమిస్తే మాస్టర్‌ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేసే అవకాశం ఉంటుంది.
– నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త,
హనుమకొండ
‘కుడా’కు కావాలి ఓ ఐఏఎస్!
‘కుడా’కు కావాలి ఓ ఐఏఎస్!


