ఎల్‌ఐసీ జనగామకు ప్రత్యేక గుర్తింపు
● రాష్ట్రంలో నంబర్ 1 ● జోనల్ 2వ స్థానం ● జాతీయ స్థాయి 15వ ర్యాంకు
జనగామ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) జనగామ శాఖ వ్యాపార పరంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో పాటు రాష్ట్రంలో నంబర్ వన్ ర్యాంకు సాధించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏడు అంశాలపై వ్యాపార పోటీ జరిగింది. 9,300 పాలసీలు, రూ.85కోట్ల టార్గెట్‌తో స్థానిక మేనేజర్ జి.హరిలా ల్ నేతృత్వంలో ఏజెంట్లు, డెవలప్ మెంట్ ఆఫీసర్లు పడిన కష్టానికి ఫలితం దక్కింది. జిల్లా కేంద్రంలో 1986 సంవత్సరం ఎల్‌ఐసీ జనగామ శాఖ నెలక్పొగా అంచెలంచెలుగా ఎదుగుతూ 14 మంది డెవలప్‌మెంట్ ఆఫీసర్ల పర్యవేక్షణలో 1,075 మంది ఏజెంట్లకు చేరుకుంది. సమష్టి కృషితో జోనల్ స్థాయి(ఏపీ, తెలంగాణ, కర్ణాటక) 2వ స్థానం, జాతీయ స్థాయిలో 15వ స్థానం, తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్‌గా నంబర్ వన్ స్థానంలో నిలిచి చరిత్రలో కొత్త అధ్యాయానికి నాందీ పలికింది.
విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలి
● ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యన్
ఎల్‌ఐసీ జనగామ శాఖ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని డీఓలు, ఏజెంట్లు పనిచేయాలని సంస్థ సీనియర్ విజనల్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యన్ పిలుపునిచ్చారు. ఎల్‌ఐసీ జనగామ విభాగం 2024–25 ఆర్థిక సంవత్సరం సాధించిన విజయాల సందర్భంగా మేనేజర్ హరిలాల్ అధ్యక్షతన సోమవారం పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. ఎల్‌ఐసీ జనగామ శాఖ కొత్త చరిత్ర సృష్టించిందని, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తుట్టకుని ఇంతటి ఘనత సాధించడం అభినందనీయమన్నారు. అనంతరం సుబ్రమణ్యన్ చేతుల మీదుగా హరిలా ల్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్ బస్వరాయ్, సేల్స్ మేనేజర్ పి.రవి శంకర్, స్టేషన్‌ఘన్‌పూర్ బ్రాంచ్ మేనేజర్ జె.మోతీలాల్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ జి.దునీలాల్ తదితరులు పాల్గొన్నారు.


