శిశువు ప్రాణం తీసిన సాధారణ ప్రసవం!

మృతి చెందిన శిశువు, మంత్రికి పంపిన మెసేజ్‌.. - Sakshi

జనగామ రూరల్‌: సాధారణ ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌లో బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలి బావ రమేష్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొడకండ్ల మండలం కడగుట్టతండాకు చెందిన జాటోత్‌ యాకేష్‌కు తిరుమలగిరి మండలం వెలిశాలకు చెందిన కల్పనతో గత ఏడాది వివాహం అయింది. కల్పనను డెలివరీ కోసం ఈనెల 27న జనగామ ఎంసీహెచ్‌ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకురాగా.. ప్రసవానికి సమయం ఉందని పంపించారు. 28న నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సాధారణ ప్రసవం కోసం వైద్యులు వేచిచూశారు. అదే రాత్రి తీవ్రంగా ఇబ్బంది పడిన కల్పనకు పెద్దాపరేషన్‌ చేయమని కోరినా డాక్టర్లు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. 29న నొప్పి ఎక్కువ కావడంతో ఉదయం 10 గంట లకు ఒక ఇంజక్షన్‌ ఇచ్చి.. మధ్యాహ్నం సాధారణ ప్రసవం చేశారు. తర్వాత శిశువు పరిస్థితి క్రిటికల్‌గా ఉందని అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎంకు పంపించగా.. మార్గ మధ్యలోనే మృతి చెందిందని కన్నీటి పర్యంతమయ్యారు.

మంత్రి హరీషరావుకు ఫిర్యాదు

శిశువు మృతి చెందిన విషయమై వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుకు ఫోన్‌ చేసి చెప్పగా.. అదే సమాచారం మేసేజ్‌ చేయమని చెప్పారని బాధితురాలి బావ రమేష్‌ తెలిపాడు. శిశువు మృతికి కారణ మైన వారిని శిక్షించాలంటూ రమేష్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ఎస్‌ఐ రఘుపతి పేర్కొన్నారు.

జనగామ ఎంసీహెచ్‌లో ఘటన

వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు

డాక్టర్ల నిర్లక్ష్యం లేదు..

పాప తల కిందకు జారి మెడకు పేగు చుట్టుకోవడం వల్లే ఇలా జరిగింది. ఆ సమయంలో పెద్ద ఆపరేషన్‌ చేయడం కుదరదు. డాక్టర్ల నిర్లక్ష్యం ఏమీలేదు. పాప జన్మించిన కొద్ది సెకండ్లపాటు ఏడ్చింది.

– డాక్టర్‌ సుగుణాకర్‌రాజు,

మెడికల్‌ సూపరింటెండెంట్‌

Read latest Jangaon News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top