ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 250 గృహాలకు మాత్రమే పూర్తిస్థాయిలో పంపిణీ ఇంకా అందాల్సిన వారు 3050 మంది
జగిత్యాల: పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. దీంతో చాలామంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని.. మంజూరురాగానే నిర్మించుకుంటున్నారు. సొంతింటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నా.. చివరి బిల్లు రాకపోవడంతో కొంతమేరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులందరూ పేదలు కావడం.. బిల్లులు సక్రమంగా రాకపోవడంతో అప్పు తేవడం.. బిల్లు సకాలంలో అందక అప్పు ఎలా తీర్చేదని మదనపడుతున్నారు. మొదటి నాలుగు దశల్లో బిల్లులు సక్రమంగా వచ్చినప్పటికీ చివరి దశ బిల్లు రూ.లక్ష ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆందోళన నెలకొంది. పేదలకు ఇళ్లు మంజూరైతే కేంద్రం వాటా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి లబ్ధిదారులకు అందిస్తారు. కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాకపోవడంతో లబ్ధిదారులు చివరి బిల్లు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో మార్చి వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి చివరి బిల్లు రూ.లక్ష అందించారు. అయితే జిల్లాలో 250 మందికి మాత్రమే పూర్తిస్థాయిలో బిల్లులు అందాయి. ఇంకా 3050 మంది చివరి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు వారి వివరాలన్నింటిని క్యాప్చర్ చేశారు. అయినప్పటికీ లబ్ధిదారుల ఖాతాల్లో బిల్లులు జమ కాలేదు.
అప్పుల బాధలు
సొంతింటి కల నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో పేదలు చాలామంది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నారు. కొందరివి ఇంకా బేస్మెంట్ స్థాయిలోనే ఉన్నాయి. కొంతమంది మహిళాసంఘాల నుంచి అప్పు తెచ్చుకున్నారు. చివరి బిల్లు రాకపోవడంతో ఇబ్బందిగా మారింది.
రావాల్సిన బిల్లు రూ.30కోట్లు
జిల్లాలో ఇప్పటివరకు 3091 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటిని ఆన్లైన్లో క్యాప్చర్ చేశారు. దాదాపు రూ.30 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బిల్లులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.
మంజూరైన ఇళ్లు 12,629
మార్కింగ్ ఇచ్చినవి 9,102
బేస్మెంట్ వరకు ఉన్న 700
గోడల వరకు 396
రూప్ లెవల్ వరకు 4,037
పూర్తయినవి 3,091
త్వరలోనే వస్తాయి
జిల్లాలో పూర్తయిన ఇళ్లన్నింటిని ఆన్లైన్ చేశాం. ఈ నెలలో వచ్చే అవకాశాలున్నాయి. లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు. చాలామంది ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేశారు.
– భాస్కర్, గృహ నిర్మాణ సంస్థ పీడీ


