మెట్‌పల్లిరూరల్: ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వొద్దని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో 82 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను గురువారం పంపిణీ చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానన్నారు. ప్రజలకు ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే కోటాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు కొందరు కాంగ్రెస్ నాయకులు డబ్బులు అడిగినట్లు పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే డబ్బులు ఎవరు అడిగారు..? ఎంత అడిగారు..? అని తెలుసుకున్నారు. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలేదన్నారు. ఎంపీడీవో మహేందర్, ఎంపీవో ప్రదీప్, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
కోరుట్ల:పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పట్టణంతో పాటు మండలంలోని 54 మందికి రూ.12.42లక్షల విలువైన చెక్కులు అందించారు. నాయకులు దారిశెట్టి రాజేష్, చీటి వెంకట్రావు, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
ఖోఖో పోటీల పర్యవేక్షణాధికారిగా నవీన్
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్ పీడీ వాసం నవీన్‌కుమార్‌ను ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల పర్యవేక్షణాధికారిగా నియమిస్తూ రాష్ట్ర కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. మేడ్చల్ జిల్లా తూంకుంట జెడ్పీ హైస్కూల్ ఆవరణలో జరిగే పోటీల పర్యవేక్షణాధికారిగా నవీన్ కొనసాగనున్నారు. హెచ్‌ఎం రాజయ్య, ఉపాధ్యాయులు నవీన్‌ను అభినందించారు.
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు తాటిపల్లి విద్యార్థులు
మల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థులు రేవతి, సంజన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల పెద్దపల్లిలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ మానస అభినందించారు.
బాస్కెట్‌బాల్ పోటీలకు..
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని ఓల్డ్‌హైస్కూల్ విద్యార్థి టి.అక్షిత్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఉమ్మడి జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన అక్షిత్.. శుక్రవారం నుంచి కరీంనగర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. హెచ్‌ఎం చంద్రకళ, పీడీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.
ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు చేయాలి
రాయికల్: గల్ఫ్‌లో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో మంజూరు చేయాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన పాలెపు రాజం ఓమన్‌లో మృతిచెందగా.. ఆయన కుటుంబాన్ని గురువారం పరామర్శించారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలుకు కృషి చేశానన్నారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి పిల్లలకు విద్య సదుపాయం, భార్యకు వితంతు పెన్షన్, నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, నాయకులు గోపి రాజిరెడ్డి, మహిపాల్‌రెడ్డి ఉన్నారు.
నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు
జగిత్యాల: నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ ప్రసూనాంబ అన్నారు. గురువారం వైద్యులతో సమావేశమయ్యారు. రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసిన వైద్యులు పారామెడికల్ సిబ్బంది మాత్రమే వైద్యసేవలు అందించాలన్నారు. ఎప్పకప్పుడు అప్‌డేట్ తప్పనిసరి అన్నారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు. డీఎంహెచ్‌వో సుజాత, ఐఎంఏ అధ్యక్షుడు శశికాంత్‌రెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, రాజేశం, రవీందర్ రాథోడ్ పాల్గొన్నారు.


