మొన్న రూ.4200.. నిన్న రూ.2500 | - | Sakshi
Sakshi News home page

మొన్న రూ.4200.. నిన్న రూ.2500

Nov 13 2026 12:28 AM | Updated on Nov 13 2026 12:28 AM

ధాన్యం కొనుగోలులో దళారుల మాయాజాలం ఒక్కసారిగా ధరలు తగ్గించిన వ్యాపారులు లబోదిబోమంటున్న అన్నదాతలు

జగిత్యాలఅగ్రికల్చర్‌: మొన్నటి వరకు సన్న ధాన్యం ధరలు చూసి సంబరపడిపోయిన రైతు.. నేడు మార్కెట్‌లో వ్యాపారులు పెట్టే రేట్లు చూసి కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు. దళారుల మాయాజాలంలో చిక్కుకుని సరైన ధర రాక విలవిలలాడుతున్నాడు. సన్నరకాలు సాగు చేస్తేనే మద్దతు ధర రూ.2,461తోపాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలో ప్రభుత్వం సూచించిన జై శ్రీరాం, బీపీటీ, హెచ్‌ఎంటీ, తెలంగాణ సోనా, కూనారం సన్నాలు, వరంగల్‌–44, కేఎన్‌ఎం–17715 రకాలను 2.35 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సన్నరకం పంటకు పురుగులు, తెగుళ్లు ఆశించడంతో.. రెండు, మూడుసార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. దొడ్డురకం ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే.. సన్నరకం ఎకరాకు 20 క్వింటాళ్ల వరకే వస్తుంది.

వారం రోజుల్లోనే పడిపోయిన ధర

ఎల్‌నినోతో వరి సాగు తగ్గిన నేపథ్యంలో సన్న ధాన్యానికి డిమాండ్‌ ఉంటుందనే ఉద్దేశంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల వ్యాపారులు ముందుగా పంట వచ్చిన ప్రాంతాల్లో క్వింటాల్‌కు రూ.3600 నుంచి రూ.4200వరకు రేటు పెట్టారు. తీరా అందరి రైతుల పంట చేతికి వచ్చాక క్వింటాల్‌కు రూ.2600 మించి పెట్టలేమంటూ చేతులెత్తేస్తున్నారు. లోకల్‌ వ్యాపారులు సిండికేట్‌గా మారి ఇతర రాష్ట్రాల వ్యాపారులను జిల్లాకు రానీయకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పంట ఒక్కసారిగా మార్కెట్లకు రావడంతో రేట్లు తగ్గడం సహజమంటూ వ్యాపారులు దాటవేస్తున్నారు. వారం రోజుల్లోనే మార్కెట్లలో క్వింటాల్‌కు రూ.1600 పడిపోవడం.. రైస్‌మిల్లులకు తీసుకెళ్లితే వారు చెప్పిన రేటుకే అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు.

బియ్యం ధరలకు బ్రేక్‌ వేయడంతో..

కరువు ప్రభావం తీవ్రంగా ఉందన్న వార్తల నేపథ్యంలో బియ్యం ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి ఆ ధరలకు బ్రేక్‌ వేసింది. బియ్యం రేట్లు నియంత్రణలో ఉండటంతో ధాన్యం రేట్లను పెంచలేమంటూ వ్యాపారులు మొండికేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర, బోనస్‌ కలిపి క్వింటాల్‌కు రూ.2,961 వస్తున్నప్పటికీ రైతులు అటు వైపు మొగ్గు చూపడం లేదు. తేమ, నాణ్యత, తరుగు వంటి ఇబ్బందుల కారణంగా రైతులు అటు వైపు వెళ్లేందుకే భయపడుతున్నారు. రైతులు తొందరపడి అమ్మవద్దని, సన్న ధాన్యానికి డిమాండ్‌ ఉందని, ఒకేసారి మార్కెట్‌కు ధాన్యం రావడంతో ధరలు తగ్గడం సహజమని, బాగా ఆరబెట్టి నిల్వ చేస్తే రాబోయే రోజుల్లో ధరలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని కొంతమంది వ్యాపారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement