ధర్మపురి: పంటలకు సరిపడా నీరందించక ఎండిపోయాయని, రైతులను పట్టించుకోని ప్రభుత్వమెందుకని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలంలోని దొంతాపూర్‌లో సాగునీరందక ఎండిపోయిన పొలాలను శనివారం సందర్శించారు. పంటల స్థితిగతులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటలు కరెంట్, సరిపడా నీరు అందించామని, కాంగ్రెస్ పాలనలో పొలాలు ఎండిపోతున్నాయని తెలిపారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. పెద్ద నక్కలపేటలో రోడ్ల పరిస్థితిని పరిశీలించి ఆర్అండ్బీ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు అయ్యోరి రాజేష్, సంగి శేఖర్ తదితరులున్నారు.
మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
ఎండిపోయిన పంటల పరిశీలన


