జగిత్యాలఅగ్రికల్చర్: రానున్న రోజుల్లో మొక్కజొన్నకు భారీగా డిమాండ్ ఏర్పడనుంది. ఇప్పటికే ప్రభుత్వ మద్దతు ధర రూ.2,410 ఉండగా, ఓపెన్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.3 వేల వరకు పలుకుతుంది. మక్క రైతులతో నేరుగా అంతర్జాతీయ పెప్సికో, బేయర్ వంటి కార్పొరేట్ కంపెనీలు త్వరలో ఒప్పందం చేసుకోబోతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సమావేశం జరుగగా, జిల్లాలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దీంతో రాబోయే ఏడాది నాటికి మొక్కజొన్న ధరలు భారీగా పెరిగి, జిల్లా రైతులకు మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
1.60 లక్షల ఎకరాల్లో..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు సీజన్లలో దాదాపు 1.60 ఎకరాల్లో మక్క సాగు చేస్తారు. అన్ని రకాల యజమాన్య పద్ధతులు పాటించడంతో ఎకరాకు 25–30 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్నారు. ఈ మేరకు 35–40 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఈసారి ఎల్‌నినోతో మక్క రేట్లు పెరుగుతున్నప్పటికీ ప్రతిసారి ప్రభుత్వం మీద లేదా ప్రైవేట్ వ్యాపారులపై ఆధారపడాల్సి వచ్చేది. మక్క సాగులో ఉమ్మడి జిల్లా వాటా దాదాపు 15 శాతం ఉంటుంది. ఇతర జిల్లాలతో పోల్చితే సాగుకు అనువైన భూములు, నీటి వసతి, అనుకూలమైన వాతావరణంతో మంచి దిగుబడులు వస్తున్నాయి. ఒక్క మక్క ద్వారానే రూ.వెయ్యి కోట్ల వరకు రైతులకు ఆదాయం సమకూరుతుంది.
రైతులతో ఒప్పందాలు
ఇటీవల హైదరాబాద్‌లో పెప్సీకో ఇండియా, బేయ ర్ క్రాప్ సైన్స్, జీఐజడ్(జర్మని ప్రభుత్వ సంస్థ), మొక్కజొన్న పరిశోధన సంస్థలు మొక్కజొన్న సా గుపై అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తలతో మూడు రోజుల పాటు సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా బేయర్ కంపెనీ నా ణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు భూమి, నీటి యాజమాన్య పద్ధతులు, ఇతర సాంకేతిక నైపుణ్యాన్ని రైతులకు అందిస్తుంది. పెప్సికో కంపెనీ కు ర్కురే, చిప్స్ తయారీలో మొక్కజొన్నను అధికంగా వాడుతుంది. దీంతో రైతుల నుంచి నేరుగా కొనుగో లు చేస్తుంది. ఇప్పటి వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో 35 వేల మందికి చేరువ కాగా, ఇప్పుడు తెలంగాణలో మక్క సాగు ఎక్కువగా ఉండే జగిత్యాల లాంటి ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వ సహకారంతో రైతులతో ఒప్పందాలు చేసుకుంటుంది.
డిమాండ్ ఎందుకంటే..
మొక్కజొన్నను ఆహార పంటగా, ఇంధనంగా, పరిశ్రమల్లో వాడుతుండటంతో రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. బాయిలర్, లేయర్ కోళ్ల ఫారాల్లో పౌల్ట్రీ దాణాగా 54 శాతం, పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌గా 18 శాతం, ఫార్మా, కాస్మోటిక్స్, గ్లూకోజ్ వంటి స్టార్స్ పరిశ్రమలో 12 శాతం, బీర్లు, విస్కీలు వంటి మద్యం తయారీ, బిస్కెట్, చిప్స్ వంటి ఆహార పరిశ్రమల్లో 15 శాతం వాడుతున్నారు. ఈ పర్సంటేజి రానున్న రోజుల్లో విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా పెట్రోల్‌లో కలిపే ఇ–20 ఇథనాల్ తయారీలో మొక్కజొన్న డిమాండ్ ఎక్కువ కానుంది.
ఉమ్మడి జిల్లాలో రెండు సీజన్లలో 1.60 లక్షల ఎకరాల్లో సాగు
రైతులతో పలు ప్రైవేటు కంపెనీల ఒప్పందాలు


