బల్దియాకు నీటి బెంగ | - | Sakshi
Sakshi News home page

బల్దియాకు నీటి బెంగ

Oct 31 2026 12:13 AM | Updated on Oct 31 2026 12:13 AM

జగిత్యాల: ఎల్‌నినోతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. దీంతో జిల్లా కేంద్రంలో తాగునీటి ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొంది. జగిత్యాలలోని ధర్మసముద్రం, హౌసింగ్‌బోర్డు ఫిల్టర్‌బెడ్‌కు డబ్బా గ్రామం నుంచి భగీరథ నీరు సరఫరా అవుతాయి. ప్రస్తుతం ఆ నీరు తక్కువగా వస్తోంది. దీంతో ధర్మసముద్రంలోని నీటిని సరఫరా చేస్తున్నారు. కాగా, హౌసింగ్‌బోర్డు ఫిల్టర్‌బెడ్‌ దెబ్బతినడంతో ఇక్కడి నుంచి నీరు వెళ్లే ట్యాంక్‌లకు భగీరథ నీటినే సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పట్టణంలోని కొన్ని వార్డులకు నీరు సరిగా సరఫరా కావడం లేదు.

మరమ్మతుల్లో ఫిల్టర్‌బెడ్‌..

ధర్మసముద్రం వద్ద రెండు ఫిల్టర్‌బెడ్‌లు శిథిలావస్థకు చేరగా, హౌసింగ్‌బోర్డుకాలనీలో మరో ఫిల్టర్‌బెడ్‌ పూర్తిగా దెబ్బతింది. దీంతో మిషన్‌ భగీరథ నుంచి వచ్చే నీటినే నేరుగా సరఫరా చేస్తున్నారు. ఫిల్టర్‌బెడ్‌ను 15 రోజుల్లో మరమ్మతు చేసి వినియోగంలోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే భగీరథ పైప్‌లైన్‌ తరుచూ మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పగిలిపోవడంతో ఆ నీళ్లు ఎప్పుడు వస్తాయో రావో తెలియని పరిస్థితి నెలకొంది.

రోజూ 18.6 ఎంఎల్‌ నీటి సరఫరా

జిల్లా కేంద్రంలో రోజూ 18.6 ఎంఎల్‌ (మిలియన్‌ లీటర్స్‌) నీటిని సరఫరా చేస్తుంటారు. ఫిల్టర్‌బెడ్‌ మరమ్మతుకు గురికావడంతో పాటు సక్రమంగా భగీరథ నీరు రాక పట్టణవాసులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పట్టణంలో 12 చోట్ల ప్రధాన లీకేజీలు, ఫిల్టర్‌బెడ్‌తో పాటు, ప్రధాన వాటర్‌ట్యాంక్‌ల వద్ద నీరు అధికంగా లీకవుతుండడంతో రోజూ సుమారు ఒక ఎంఎల్‌ నీరు వృథాగా పోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటీ నుంచి 12–13 ఎంఎల్‌ నీటిని సరఫరా చేస్తుండగా ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు. కొన్ని వార్డులకు అధికారులు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. మొన్నటి వరకు 45 నిమిషాల నుంచి గంట పాటు నీటి సరఫరా చేయగా, ప్రస్తుతం 30 నిమిషాలు మాత్రమే ఇస్తున్నారు. నీటి లీకేజీలు అరికట్టేందుకు ఇటీవల టెండర్లు పిలిచారు. మున్సిపాలిటీలో లేబర్‌ లేకపోవడంతో టెండర్ల ద్వారా పిలిచినా ఎవరూ రావడం లేదని తెలిసింది. పట్టణంలో అండర్‌గ్రౌండ్‌లో పాత పైప్‌లైన్లు ఉండడంతో లీకేజీలు ఏర్పడుతున్నాయి. గతంలో అమృత్‌ పథకం కింద రూ.35 కోట్లు మంజూరు కాగా కొత్తపైప్‌లైన్లు, ట్యాంక్‌లు నిర్మిస్తున్నారు. ఆ పనులు కూడా సక్రమంగా జరగడం లేదు.

అడుగంటుతున్న ధర్మసముద్రం

జగిత్యాల పట్టణవాసులకు ధర్మసముద్రం చెరువు వరప్రదాయిని. భగీరథ నీళ్లు రాకుంటే ఈ నీరే దిక్కు. గతంలో ఈ చెరువును ఎస్సారెస్పీ నీటితో నింపి పట్టణమంతా సరఫరా చేసేవారు. భగీరథ నీరు వచ్చాక డబ్బా గ్రామం నుంచి వాటర్‌ ఫిల్టర్‌బెడ్‌లకు అనుసందానం చేసి ఆ నీటినే సరఫరా చేస్తున్నారు. వీటికి మరమ్మతు వచ్చినప్పుడు మళ్లీ ట్యాంక్‌ నీరే వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఫిల్టర్‌బెడ్‌ దెబ్బతినడం, భగీరథ నీరు రాక పట్టణవాసులకు జలగండం పొంచి ఉంది. అలాగే, ధర్మసముద్రం క్రమంగా దెబ్బతింటోంది. కట్ట సరిగా లేక నీరు వృథా అవుతోంది. గతంలో కట్టకు ఇసుక బస్తాలు వేశారు. చెరువును విస్తరించాలని, ప్రణాళిక రూపొందించి కట్టను 1.5 మీటర్ల ఎత్తు పెంచాలని గతంలో నిర్ణయించినా ఆ పనులు ముందుకు సాగడం లేదు.

జిల్లా కేంద్రంలో పడిపోతున్న భూగర్భజలాలు

ధర్మసముద్రం చెరువులో తగ్గుతున్న నీటిమట్టం

మరమ్మతుకు గురయిన ఫిల్టర్‌బెడ్‌

పలుచోట్ల తాగునీటికి ఇబ్బంది పడుతున్న పట్టణవాసులు

పట్టణం వివరాలు

జనాభా లక్షకు పైగా

నల్లా కనెక్షన్లు 14,000

రోజూ నీటి సరఫరా 18.6 మిలియన్‌ లీటర్స్‌

ప్రస్తుతం సరఫరా 12 మిలియన్‌ లీటర్స్‌

ధర్మసముద్రం సామర్థ్యం 935 ఎంఎల్‌

ప్రస్తుతం ఉన్ననీరు 720 ఎంఎల్‌ (30–40 రోజుల వరకు సరిపోతాయి)

ఇబ్బందులు లేకుండా చర్యలు

ప్రస్తుతం గ్రిడ్‌ వాటర్‌ సరఫరా చేస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు లేవు. ఫిల్టర్‌బెడ్‌ 10 రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. లీకేజీలు అరికట్టేలా టెండర్లు పిలవడం జరిగింది. ప్రస్తుతం నీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి.

– అరుణ్‌, డీఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement