మెట్‌పల్లిరూరల్: జిల్లాలోని అటవీశాఖలో ఏం జరుగుతోందనేది చర్చనీయాంశంగా మారింది. ఆ శాఖ కు సంబంధించిన మెట్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైనప్పటికీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. మెట్‌పల్లి మండలం రంగారావుపేట బీట్ కంపార్ట్‌మెంట్ పరిధి రంగారావుపేట, అల్లూరి సీతరామరాజు తండా శివా రు ప్రాంతంలో అటవీ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణ లకు గురయ్యాయి. ఏళ్లుగా సాగుతున్న ఈ త తంగంపై విజిలెన్స్ దృష్టి సారించి లోతుగా దర్యా ప్తు జరపడం..స్థానిక అధికారుల పర్యవేక్షణలేమిని ఎత్తిచూపుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నా యి. మరోవైపు కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజిలెన్స్ బృందం విచారణకు వస్తున్నారని తెలుసుకున్న ఓ అధికారి ఓ ప్రజాప్రతినిధికి ఫోన్ చేసి ‘తాను చేయాల్సింది చేసినా.. విధుల్లో భాగంగా నిబంధనల ప్రకారం నడుచుకున్నా.. సిబ్బంది పై చర్యలు కూడా తీసుకున్నానని కొంచెం చూడండని..తన తప్పేమి లేదు’ అని చెప్పడం గమనార్హం.
పంటలకు వరదకాల్వ నుంచి పైప్‌లైన్లు
రంగారావుపేట, అల్లూరి సీతరామరాజుతండా ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన అటవీ భూముల్లో కొందరు పంటలు సాగు చేస్తుండగా, మిగతా చోట్ల ఖాళీగానే వదిలిపెట్టినట్లు తెలిసింది. అయితే సాగుచేస్తున్న పంట పొలాలకు వరదకాల్వ నుంచి పైప్‌లైన్లు వేసుకున్నట్లు సమాచారం. కాగా, కాల్వలో వేసుకున్న మోటార్లకు ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కరెంట్ కనెక్షన్ తీసుకోవాలంటే నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సాగు చేసుకుంటున్న భూమికి సంబంధించి పాస్‌బుక్, వన్–బీ, నివాస కరెంట్ బిల్లు, గ్రామ జీపీవో ధ్రువీకరణ పత్రం, కెపాసిటర్ రశీదు తప్పనిసరి. కానీ, అటవీ భూముల్లో సాగుకు విద్యుత్ కనెక్షన్ ఎలా వచ్చిందోనన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా మరికొందరు వారికి సంబంధించిన వ్యవసాయ భూముల వరకు గతంలో కనెక్షన్‌లు తీసుకోగా..ఆభూముల వద్దే బావుల మాదిరిగా తవ్వించుకొని వాటిలోకి కాల్వ నీటిని తరలించి అటవీ భూముల్లో సాగు చేస్తున్న పంటలకు సరఫరా చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇంకొందరు బోర్లు వేయించుకున్నట్లు సమాచారం. అటవీ భూముల ఆక్రమణలు ఏళ్ల కిందటే ప్రారంభమైనా ఏప్రిల్ 2024 నుంచి ఆ ఏడాది చివరి వరకు పెద్ద ఎత్తున జరిగాయని, ఆ సమయంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆ ప్రాంతానికి చెందిన వారు చెబుతున్నారు.
విజిలెన్స్ నివేదికే కీలకం
అటవీ భూముల దందా వ్యవహారంపై ప్రస్తుతం విజిలెన్స్ లోతుగా విచారణ జరపుతుండడంతో ఆ శాఖలోని అధికారులు, సిబ్బందిలో వణుకు మొదలైంది. కొద్దిరోజుల క్రితం విచారణకు వచ్చిన విజిలెన్స్, ప్లయింగ్ స్క్వాడ్, ఉన్నతాధికారుల బృందం భూముల ఆక్రమణలను చూసి కంగుతిన్నారు. పలు విషయాలపై లోతుగా ఆరా తీశారు. ఏడేళ్ల క్రితం నుంచి పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను హైదరాబాద్‌లోని చీఫ్ కన్జర్వేటర్ కార్యాలయంలో విచారించగా.. మిగతా కిందిస్థాయి సిబ్బందిని జిల్లాలోని అటవీ కార్యాలయంలో విచారించినట్లు తెలిసింది. మొత్తంగా అటవీ భూముల దందా వ్యవహారంలో విజిలెన్స్ నివేదికనే కీలకంగా మారగా..బాధ్యులపై చర్యలు తీసుకుంటారా.. లేదా..అనే దానితో పాటు ఇకనైనా భూముల ఆక్రమణలు ఆగిపోతాయా.. ఆక్రమించిన భూములను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.
భూముల దందాను పట్టించుకోకపోవడంపై విమర్శలు
లోతుగా దర్యాప్తు జరుపుతున్న విజిలెన్స్
అటవీ అధికారుల్లో గుబులు


