ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వర ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం చేసి పూలతో అలంకరించారు. అర్చకుడు శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థినులు
అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలజోన్: విద్యార్థినులు వ్యక్తిగత భద్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి మట్ట సరిత అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ జెడ్పీ హైస్కూల్‌లో పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక వేధింపులకు పాల్పడితే ఆ విషయాలను తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు వివరించాలన్నారు. బాలల సంరక్షణ అధికారి సురేశ్ తదితరులున్నారు.
పనులు నాణ్యతతో చేపట్టాలి
మెట్‌పల్లి: పట్టణంలోని ఇరిగేషన్ క్యాంపులో రూ.92లక్షలతో నిర్మించే కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయ భవన నిర్మాణ పనులకు శుక్రవారం రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక వసతులతో నిర్మిస్తున్న భవన పనులను నాణ్యతగా చేపట్టాలన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, ఈఈ సురేశ్, డీఈ అరుణోదయ్‌కుమార్, ఏఈలు తిరుపతి, అమూల్య, అనురాగ్, భూంరాజ్, డీఏవో విజయేందర్, సూపరింటెండెంట్ అమరేందర్‌రెడ్డి తదితరులున్నారు.
కుష్ఠువ్యాధిపై సర్వే
జగిత్యాలరూరల్: కుష్ఠువ్యాధి గుర్తింపునకు ఇంటింటి సర్వే చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర లెప్రసీ బృందం వైద్యాధికారి డాక్టర్ రాజు అన్నారు. శుక్రవారం జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌లో సర్వే నిర్వహించారు. శరీరంపై తెల్లటి, ఎర్రటి, రాగి రంగు మచ్చలు ఏర్పడితే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, వైద్యాధికారి సౌజన్య పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం వడ్డించాలి
ఇబ్రహీంపట్నం: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని జిల్లా వెల్ఫేర్ అధికారి డాక్టర్ భాస్కర్ సూచించారు. శుక్రవారం మండలకేంద్రంలోని కస్తూరిభాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ వరప్రసాద్, వైద్యాధికారి హరీశ్, స్పెషల్ ఆఫీసర్ రజిత పాల్గొన్నారు.
జిల్లాకు వర్ష సూచన
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4 వరకు అతితేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పొలాస వ్యవసాయ పరిశోధనస్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. ముఖ్యంగా నవంబర్ 2, 4వ తేదీల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, 3న అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. పగటి ఉష్ణోగ్రత 20–33, రాత్రి ఉష్ణోగ్రత 21–23 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ ఉదయం 91–95, మధ్యాహ్నం 46–70 శాతం మధ్య ఉంటుందని, ఆగ్నేయ దిశ నుంచి ఈదురుగాలులు గంటకు 2–6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు.


