జగిత్యాలజోన్: జిల్లా కోర్టులో మంగళవారం న్యాయ పరిపాలన అంశాలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, జిల్లాలోని వివిధ కోర్టుల జడ్జిలు పాల్గొన్నారు. ధరూర్ క్యాంప్‌లో కోర్టు కాంప్లెక్స్‌కు కేటాయించిన భూమి అప్పగించాలని, జిల్లాకు మంజూరైన కొత్త కోర్టులకు భవనాలు కేటాయించాలని, పెండింగ్ కేసులకు సంబంధించిన విషయాలపై చర్చించారు. భూసేకరణలో పరిహారాన్ని కోర్టు తీర్పుల ప్రకారం జమ చేయాలని కోరారు. పోలీస్, రెవెన్యూ శాఖల్లో సమన్వయం లేక కోర్టులకు నివేదికలు అందడం లేదన్నారు. జిల్లా కోర్టుల నుంచి పంపించిన లేఖలపై ఎప్పటికప్పుడు అధికారులు స్పందించాలని జడ్జిలు సూచించారు. నివేదికల్లో జాప్యాన్ని నివారిస్తే కేసుల విచారణ త్వరగా పూర్తయి కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. మొదటి అదనపు జడ్జి సునీత, సబ్ జడ్జి నాగేశ్వర్రావు, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, డీఎస్పీలు, సీఐలు, పీపీలు పాల్గొన్నారు.


