కథలాపూర్: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి పైపులైన్ ద్వారా మండలంలోని వివిధ గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ సరఫరా కొన్ని గ్రామాలకే పరిమితమైంది. చాలాగ్రామాలకు నెలల తరబడిగా నీరు రావడంలేదని, ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేరని ప్రజలు మండిపడుతున్నారు.
44 రక్షిత మంచినీటి ట్యాంకులు
కథలాపూర్ మండలంలో 19 గ్రామాలున్నాయి. ఇంటింటికీ నల్లా ద్వారా నీరందించేందుకు 44 ట్యాంకులు నిర్మించారు. వీటి పరిధిలోని సుమారు 13వేల నల్లా కనెక్షన్లకు నీరందించాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంకులకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ శివారులోని అగ్రహారం గ్రిడ్ నుంచి ప్రతిరోజు నీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. గ్రిడ్ నుంచి నీటి సరఫరా చేస్తున్నప్పటికీ విద్యుత్ మోటార్ల సమస్యనో.. పైపులైన్లు సరిగాలేకనోగానీ.. మండలంలోని వివిధ గ్రామాల్లోని ట్యాంకులకు నీరు చేరడంలేదు. ఫలితంగా ప్రజలకు నీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలా నెలల తరబడి నీళ్లు రాకపోవడంతో సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లితే పరిష్కరిస్తామని చెబుతున్నా.. ఆ తర్వాత యథావిధిగా నీటి సమస్య ఉంటోందని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగీరథ నీరు రాకపోవడంతో బోరుబావుల ద్వారా సరఫరా చేసి తామే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సర్పంచులు అంటున్నారు.
నీటి సమస్యలున్న గ్రామాలివే..
మండలంలోని చింతకుంట, భూషణరావుపేట, ఊట్‌పెల్లి, పెగ్గెర్ల, బొమ్మెన, రాజారాంతండా, తక్కళ్లపెల్లి గ్రామాలకు మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి సరిగా నీళ్లు రావడంలేదని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు చెబుతున్నారు. విషయాన్ని ఆర్నెళ్ల క్రితం మండల సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించామని, ప్రజావాణిలో స్వయంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని సర్పంచులు అంటున్నారు. సమస్యను నెలల తరబడి పరిష్కరించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టింపులేదు
సర్పంచ్‌గా గెలిచి నెలలు గడుస్తోంది. గ్రామంలో నీటి సమస్య ఉందని, మిషన్ భగీరథ నీరు ట్యాంకుకు రావడంలేదని అధికారులకు ఫిర్యాదు చేసిన. పరిష్కరిస్తామని చెబుతున్నారు తప్ప పట్టించుకోవడం లేదు. కొన్ని గ్రామాలకు సరఫరా చేసి కొన్ని గ్రామాలపై నిర్లక్ష్యం చేయడం తగదు. అధికారులు సమస్యపై ఇంత ఘోరంగా వ్యవహరించడం దారుణం. సమస్య పరిష్కరించుకుంటే ఉద్యమిస్తాం.
– బద్దం మహేందర్‌రెడ్డి, సర్పంచ్, భూషణరావుపేట
పరిష్కారంలో జాప్యం వద్దు
అగ్రహారం మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊరి ట్యాంకుకు నీరు రావడంలే దు. ప్రజలకు నీరందించడంలో ఇబ్బందిగా ఉంది. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడంలేదు. ఎత్తు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లోని ట్యాంకులకు నీరు చేరేలా ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేయాలి. కొత్త పైపులైన్ వేసి నీరు సరఫరా చేసి ప్రజల దాహార్తి తీర్చాలి. జాప్యం చేయవద్దు. – చిందం సుధాకర్, సర్పంచ్, బొమ్మెన
నీరందించేలా చర్యలు
మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి కథలాపూర్ మండలంలోని చివరి గ్రామాలకు నీళ్లు చేరడంలేదని ఫిర్యాదులు వచ్చాయి. అప్పట్లో విద్యుత్ మోటార్ల సమస్య ఉండటం వల్ల నీటి సరఫరా సరిగా చేయలేకపోయాం. వాటిని రిపేర్ చేయించాం. మండలంలోని పైపులైన్ మధ్యలో ఉన్న గేట్ వాల్‌లను కంట్రోల్ చేసి అన్ని గ్రామాలకు నీళ్లు చేరేలా చూడాలని సిబ్బందికి ఆదేశాలిస్తాం.
– విశ్వాన్, డీఈ, మిషన్ భగీరథ గ్రిడ్, వేములవాడ


