కరువు మండలాలు 8 | - | Sakshi
Sakshi News home page

కరువు మండలాలు 8

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 8 మండలాలకు మోస్తరు ముప్పు జాబితాలో పెద్దపల్లికి మొండిచేయి తమ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోలేదంటున్న అన్నదాతలు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరువు చాయలు అలుముకున్నాయి. 2026 యాసంగి సీజన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కరువు ప్రభావిత మండలాల జాబితాలో కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన ఎనిమిది మండలాలను చేర్చారు. ఆయా మండలాలను మోస్తరు కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. పెద్దపల్లి జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించకపోవడంపై అక్కడి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ)శాఖ వర్షపాత లోటు, వ్యవసాయ పరిస్థితులు, నేలలో తేమశాతం, భూగర్భ జలాల లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని మండలాల వారీగా కరువు తీవ్రతను అంచనా వేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎనిమిది మండలాల్లో..

ప్రభుత్వ జాబితాలో కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌ అర్బన్‌, కరీంనగర్‌ రూరల్‌, హుజూరాబాద్‌ మండలాలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, జగిత్యాల రూరల్‌, కొడిమ్యాల మండలాలను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ, ఇల్లంతకుంట మండలాలుగా ప్రకటించారు.

పెద్దపల్లి రైతుల్లో ఆవేదన

పెద్దపల్లి జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించకపోవడంపై రైతుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు తమ ప్రాంతంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఉంటే కరువు జాబితాలో చోటు దక్కేదని అభిప్రాయపడుతున్నా రు. కరువు ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం ప్రకటించే సహాయక చర్యలు, వ్యవసాయ సంబంధిత రాయితీలు అందే అవకాశం ఉండటంతో తమ జిల్లాకు జాబితాలో చోటు లేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. కరువు తీవ్రతను అంచనా వేసే సమయంలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. వర్షపాతం, పంటల పరిస్థితి, భూగర్భ జలాల లభ్యత వంటి అంశాల ఆధారంగా తమ జిల్లాలోని మండలాలను మరోసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆరు నెలల పాటు అమల్లో ఉత్తర్వులు

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కరువు ప్రభావిత మండలాల గుర్తింపు ఆరు నెలలపాటు అమల్లో ఉండనుంది. ఈ కాలంలో ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం సూచించింది. రైతులకు వ్యవసాయ పెట్టుబడి రాయితీలు, తాగునీటి సరఫరా, పశుగ్రాసం అందుబాటు, ఉపాధి కల్పన వంటి అంశాలపై అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement