పచ్చటి పొలాల మధ్య.. సాయం సంధ్య వేళల్లో ఊరి మైదానం కిటకిటలాడిపోయేది. కబడ్డీ.. కబడ్డీ.. అంటూ ఊపిరిని నియంత్రణలో ఉంచుతూ.. ప్రత్యర్థి కోర్టులోకి వెళ్లే ఆ కూత, మట్టి వాసనతో కూడిన ఆ ఆట ప్రతి నరంలోనూ రక్తాన్ని ఉడుకెత్తించేది. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లకే పరిమితమవుతున్న యువతకు.. మన నేల ప్రతిభను చాటే ఈ గ్రామీణ రారాజు కబడ్డీ ప్రాముఖ్యం తెలుసుకోవడం ఎంతో అవసరం. ఒకప్పుడు మన తాతలు, తండ్రులు ఆడిన నాటి కబడ్డీకి.. నేడు మనం టీవీల్లో చూస్తున్న ప్రో కబడ్డీకి మధ్య ఆటతీరు మారినా.. దానిలోని ఆవేశం మాత్రం మారలేదని చెప్పక తప్పదు.
● ఐక్యత చాటే గ్రామీణ క్రీడ ● వచ్చే నెల 1 నుంచి 4 వరకు వేములవాడలో రాష్ట్రస్థాయి పోటీలు
వేములవాడ: నాటి రోజుల్లో ఎర్రటి మట్టి, కాస్త ఇసుక చల్లిన సహజసిద్ధమైన మైదానాల్లో కాళ్లకు ఎటువంటి ప్యాడింగ్స్ లేకుండా ఆడేవారు. క్రీడాకారులే ఖాళీ స్థలాన్ని చదును చేసుకొని కోర్డులో పారతో లైన్లు వేసుకునేవారు. కనీసం లైన్లకు సున్నం కూడా పోసుకునే పరిస్థితి ఉండకపోయేది. నేడు మ్యాట్లు, ప్యాడ్లు, ఆధునిక రక్షణ పరికరాలతో ఇండోర్ స్టేడియాల్లో ఆడుతున్నారు. అప్పట్లో సమయ పరిమితి కంటే ఓర్పు, శారీరక బలానికి ప్రాధాన్యముండేది. ఇప్పుడు 30 సెకన్ల రైడ్ లిమిట్, డు ఆర్ డై రైడ్స్, సూపర్ టాకిల్ వంటి నిబంధనలతో ఆట మరింత వేగంగా, వ్యూహాత్మకంగా మారింది. నాటి ఆటలో కేవలం శారీరక బలం, స్థానిక శైలి ప్రధానంగా ఉండేవి. నేటి కబడ్డీలో బోనస్ పాయింట్లు, టో టచ్, దూకి తప్పించుకోవడం, ఫ్రాగ్ జంప్, మ్యాట్ పొజిషనింగ్ వంటి పక్కా వ్యూహాలు, వీడియో రివ్యూ సిస్టమ్స్ వచ్చి చేరాయి. వచ్చే నెల 1 నుంచి 4 వరకు వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దాదాపు 1,300 మంది క్రీడాకారులు, కోచ్‌లకు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు.
●


