అటవీ భూములు అన్యాక్రాంతం..! | - | Sakshi
Sakshi News home page

అటవీ భూములు అన్యాక్రాంతం..!

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

మెట్‌పల్లిరూరల్‌: అటవీ భూముల్లో అడుగు పెట్టాలంటే.. ఎంతటి వారైన కాస్త వెనుకాముందు ఆలోచించేవారు. అటవీ చట్టాలు కఠినంగా ఉంటాయనే భయంతో చిన్న చెట్టును కొట్టాలన్నా.. భయపడి వాటి జోలికి వెళ్లేవారు కాదు. ఇది గతం.. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. అటవీ భూములని తెలిస్తే చాలు ఆక్రమించే దుస్థితి దాపురించింది. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలం రంగారావుపేట బీట్‌ కంపార్ట్‌మెంట్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. భూములను అడ్డగోలుగా చదును చేస్తూ తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆక్రమణలపై ఫిర్యాదులు కూడా పెరిగిపోతున్నాయి. ఫిర్యాదులపై విచారణ జరుపుతున్న ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

600 ఎకరాలకు పైగా అటవీ భూమి

మెట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల శివారు ప్రాంతాల్లో అటవీ భూములు పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న సమీప గ్రామాలకు చెందిన కొందరు ఇష్టారీతిగా భూములను ఆక్రమించి హద్దులు ఏర్పాటు చేసుకుంటున్నారు. రంగారావుపేట బీట్‌ కంపార్ట్‌మెంట్‌ పరిధిలో దాదాపు 600 ఎకరాలకు పైగా అటవీ భూమి ఉంది. ఇందులో జగ్గాసాగర్‌, రామలచ్చక్కపేట, ఆత్మనగర్‌, ఆత్మకూర్‌, మెట్లచిట్టాపూర్‌, కేసీఆర్‌తండా, పాటిమీది తండా, అల్లూరి సీతారామరాజు తండా, రంగారావుపేటతో మరికొన్ని గ్రామాల శివారు ప్రాంతాల్లో అటవీ భూమి ఉంది. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల అటవీ భూముల్లోకి ప్రవేశించి అర్ధరాత్రి సమయంలో జేసీబీలు, బ్లేడ్‌ ట్రాక్టర్ల సహాయంతో భూములు చదును చేస్తున్నారు. పచ్చని చెట్లు, పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను తొలగిస్తూ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు.

ఆక్రమణలపై చర్యలు..

రంగారావుపేట శివారులో అటవీ భూముల ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విషయంపై గ్రామస్తులు పలుమార్లు బీట్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. కానీ.. ఆయన పట్టించుకోలేదు. దీంతో ఇటీవల జిల్లాకేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు భూములు ఆక్రమణకు గురైనట్లు తేల్చారు. ఈ వ్యవహారంలో బీట్‌ అధికారి ప్రదీప్‌ను సస్పెండ్‌ చేశారు. అటవీ భూముల ఆక్రమణను అడ్డుకోకపోవడంతోపాటు కనీసం కేసులు నమోదు చేయకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే మెట్లచిట్టాపూర్‌ శివారులో అటవీ భూమిలో చెట్లను తొలగించి చదును చేశారు. దీనిపై గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అటవీ శాఖ 611/11 కంపార్ట్‌మెంట్‌లో 0.23 హెక్టార్లలో చదును చేసినట్లు గుర్తించారు. అటవీ భూమి చదును చేసిన వారిపై కేసు నమోదు చేశారు.

రాత్రయితే చాలు.. చెట్లను కొట్టేసి చదును

కనుమరుగవుతున్న అటవీ భూములు

ఆక్రమణలపై గ్రామస్తుల ఫిర్యాదులు

విధుల్లో నిర్లక్ష్యంపై బీట్‌ అధికారి సస్పెండ్‌

అటవీ భూములు ఆక్రమిస్తే చర్యలు

అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపాం. బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నాం. అటవీ భూముల ఆక్రమణల వ్యవహారం, విధుల్లో నిర్లక్ష్యం వహించిన బీట్‌ అధికారిపై చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా అటవీ భూములు ఆక్రమిస్తే సమాచారం అందించాలి.

– షౌకత్‌అలీ, అటవీశాఖ రేంజ్‌ అధికారి, మెట్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement