బీజేపీలో పాతికేళ్లపాటు నిస్వార్థ సేవ చనిపోయి ఐదు నెలలైనా కన్నెత్తి చూడని నేతలు ఉమ్మడి జిల్లాలో కేంద్రమంత్రి, పొరుగున ఎంపీ ఉన్నా దొరకని ఓదార్పు దిక్కుతోచని స్థితిలో మృతుడి భార్య స్వప్న, ఇద్దరు చిన్నారులు
గొల్లపల్లి: ఆయన పాతికేళ్లపాటు కాషాయ జెండా మోశాడు. పార్టీ కార్యక్రమాలు, నాయకుల కోసం జీవితమే ధారపోశాడు. అలాంటి కార్యకర్త అనారోగ్యంతో చనిపోతే ఆ పార్టీ నాయకత్వం కనీసం పలుకరించేందుకూ రాకపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. గొల్లపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన చిలివేరి సత్యం పాతికేళ్ల క్రితం సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరాడు. రెండు పర్యాయాలు మండల ఉపాధ్యక్షుడిగా.. మరో రెండు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర పథకాలను గడపగడపకూ చేరవేస్తూ పార్టీకి కొండంత అండగా నిలిచారు. ఊళ్లో ఎవరికి కష్టం వచ్చినా ముందుండే సత్యం.. పార్టీ పిలుపునిస్తే పనులన్నీ వదిలి ఉన్నఫళంగా పరుగులు తీసేవారు.
ఆసుపత్రి బెడ్‌పై పోరాటం.. నాయకుల ముఖం చాటు
ఈ ఏడాది మే నెలలో సత్యం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి చేర్పించగా పరిస్థితి విషమించి చనిపోయాడు. ఆసుపత్రిలో మత్యువుతో పోరాడుతున్న సమయంలోగానీ.. చనిపోయినప్పుడుగానీ.. పార్టీ నాయకత్వం నుంచి కనీస ఆర్థిక సాయం అందలేదు. అంత్యక్రియల సమయంలో పార్టీ కండువా కప్పి చేతులు దులుపుకున్న నాయకులు.. తర్వాత ఆ ఇంటి గుమ్మం వైపు చూడలేదు. సత్యం బతికున్న రోజుల్లో ఆయన ఇల్లే నాయకులకు అడ్డా. ఆయన ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రధాని మోదీ నిలువెత్తు చిత్రపటాలు, ఛత్రపతి శివాజీ విగ్రహాలు, కాషాయ జెండాలు దర్శనమిస్తాయి. నియోజక, జిల్లాస్థాయి నేతలను ఆప్యాయంగా ఆదరించి, అప్పు చేసైనా మర్యాదలు చేసేవారు. అయితే సత్యం చనిపోయి ఐదు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క నాయకుడూ పరామర్శించకపోవడం గమనార్హం. ఆ పార్టీలో కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతటి బలమైన నాయకత్వం ఉన్నా.. సత్యం కుటుంబాన్ని గాలికొదిలేయడంపై స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. నాయకుల ప్రచారాలు, సభకు కార్యకర్తలను వాడుకుని, ఆపదలో వారి కుటుంబాలను రోడ్డున పడేయడం నాయకత్వానికే మాయని మచ్చని గ్రామస్తులు మండిపడుతున్నారు. పార్టీ పెద్దలు స్పందించి, తండ్రిలేని ఆ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మా బతుకులు రోడ్డున పడ్డాయి
నా భర్త బతికున్నంత కాలం పార్టీ జెండానే మోశారు. నేతలు వస్తే కడుపునిండా తిండిపెట్టి పంపేవారు. ఆయన పోయాక మా పరిస్థితిని ఏ ఒక్క నాయకుడూ వచ్చి అడగలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇద్దరు పిల్లలు ప్రణయ్, చరణ్‌ను ఎలా సాకాలో అర్థం కావడం లేదు.
– చిలివేరి స్వప్న, సత్యం భార్య


