‘జీపీఎఫ్‌’ నిధుల మాయంపై కదలిక! | - | Sakshi
Sakshi News home page

‘జీపీఎఫ్‌’ నిధుల మాయంపై కదలిక!

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

● కొనసా..గుతున్న విచారణ ● ఇప్పటికే రికార్డు అసిస్టెంట్‌ రిమూవ్‌ ● చర్యలు తీసుకోవాలని ఎస్పీకి తాజాగా ఫిర్యాదు

జగిత్యాల: జిల్లా వైద్య విధాన పరిషత్‌లో పనిచేసిన ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లోని నిధులు రెండేళ్ల క్రితం మాయమైన విషయం తెల్సిందే. అప్పటి నుంచి విచారణ కొనసాగుతుండగా.. తాజాగా మరోసారి కదలిక వచ్చింది. ఆ శాఖలోని అకౌంట్స్‌ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి నిధులు పక్కదారి పట్టించగా.. ఈ వ్యవహారాన్ని మొత్తం 2024లోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. అప్పటినుంచి విచారణ కొనసా..గుతూనే ఉంది. ఇందులో బ్యాంక్‌ అధికారులు కూడా బాధ్యులుగా ఉన్నారని అప్పట్లోనే వైద్య విధాన పరిషత్‌ అధికారులు గుర్తించారు. ఆ సమయంలోనే రికార్డు అసిస్టెంట్‌ను రిమూవ్‌ చేసినట్లు తెలిపారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయమై కోర్టులో చార్జిషీట్‌ వేశాక పూర్తిస్థాయిలో చర్యలుంటాయని చెబుతున్నారు. అయితే తాజాగా మంగళవారం ఈ విషయమై డీసీహెచ్‌ రామకృష్ణ, అసిస్టెంట్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌రావు ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసినట్లు తెలిసింది. వైద్య విధాన పరిషత్‌లో పనిచేసే ఉద్యోగుల ఖాతాల నుంచి ముందుగా రూ.50లక్షలు మాయమైనట్లు ప్రకటించినప్పటికీ.. విచారణలో మాత్రం రూ.6 కోట్లకు పైగానే ఇతర ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. గతంలో బ్లాక్‌ అయిన సూపరింటెండెంట్‌ అకౌంట్‌ను తిరిగి పునరుద్ధరించి నిధులను అందులోకి మళ్లించారని, కొన్ని సొంత ఖాతాల్లోకి.. మరిన్ని వారి బంధువుల ఖాతాల్లోకి మళ్లించినట్లు నిర్ధారించారు. ఇంత జరిగినా.. బ్యాంక్‌ అధికారులు కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో సదరు నిందితులతో కుమ్మక్కు అయినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ వ్యవహారం దాదాపు రెండేళ్లు కావస్తుండగా.. ఇప్పటి వరకు కొలిక్కి రాకపోవడం గమనార్హం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నా జాప్యం జరుగుతోంది. మరోవైపు వైద్య విధాన పరిషత్‌ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో ఇక్కడ పనిచేస్తున్న అధికారులు అటు పోలీసులు, ఇటు బ్యాంక్‌ అధికారులను తరుచూ కలుస్తున్నారు. మాయమైన నిధులు రికవరీ చేయిద్దామన్న ఉద్దేశంతో సదరు ఉద్యోగిపై కొంతకాలం వేచి చూశారు. సుమారు రూ.2 కోట్ల వరకు రికవరీ అయినప్పటికీ ఇంకా రూ.4కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. దీంతో జీపీఎఫ్‌ ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. నిధులు మళ్లించిన ఉద్యోగిని ఏకంగా రిమూవ్‌ చేయడంతో నిధులు రికవరీ ఉంటుందా..? ఉండదా..? తెలియాల్సి ఉంది. నిధులు మళ్లించినట్లు సదరు ఉద్యోగి ఒప్పుకుని.. కొన్ని రోజులకు డబ్బులు చెల్లిస్తానని మాట ఇచ్చి.. కొన్నిమాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నట్లు తెలిసింది. అతడిని రిమూవ్‌ చేయడంతో రికవరీ ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

రెండో విచారణ కొనసాగింపు

అధిక మొత్తంలో డబ్బు కావడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడి వైద్య విధాన పరిషత్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే సదరు అధికారితో పాటు, బ్యాంక్‌ అధికారులకు సంబంధించిన వివరాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదేమైనా రెండేళ్లు కావస్తున్నా ఈ విషయంపై ఇంకా విచారణ కొనసాగడంపై జీపీఎఫ్‌ ఖాతాల్లోని నిధులు వస్తాయో..? లేదోనని సదరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

విచారణ చేస్తున్నాం

పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నాం. పోలీసులకూ ఫిర్యాదు చేశాం. సదరు ఉద్యోగి రిమూవ్‌ అయ్యారు. త్వరలోనే విచారణ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఎస్పీకి ఫిర్యాదు చేశాం.

– రామకృష్ణ, డీసీహెచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement