మాట్లాడుతున్న చైర్‌పర్సన్ సమిండ్ల వాణి
పాల్గొన్న కౌన్సిలర్లు
జగిత్యాల: పట్టణ ప్రజలకు వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యమని, పట్టణంలో క్లీన్ అండ్ గ్రీన్ అందరి బాధ్యత అని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కౌన్సిల్ కృషి చేస్తోందన్నారు. బతుకమ్మ, దసరా పండుగలకు ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాల పనులు, మున్సిపల్ శానిటేషన్ వాహనాల మరమ్మతుకు రూ.4 లక్షలు కేటాయించేందుకు కౌన్సిల్ ఆమోదించింది. వివిధ వార్డుల్లో సీసీరోడ్ల ప్యాచ్‌వర్క్‌లకు రూ.50లక్షలకు ఆమోదించారు. మున్సిపల్‌కు సంబంధించి షాపులను అద్దె/లీజుకు ఇచ్చేందుకు పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ఆదాయం సమకూర్చేలా చేస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో భూముల వినియోగం మార్పుపై చర్చించామని, రెసిడెన్షియల్ జోన్ నుంచి కమర్శియల్ జోన్‌గా, రెసిడెన్షియల్ జోన్ నుంచి మిక్స్‌డ్ జోన్‌గా మార్పులకు చర్యలు తీసుకుంటామన్నారు. పలువురు కౌన్సిల్ సభ్యులు శానిటేషన్, ఇతరత్రా అవసరాలపై సభ దృష్టికి తీసుకురాగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల మృతిచెందిన మున్సిపల్ కార్మికులు చాంద్‌ఖాన్, కోండ్ర రవీందర్, రిటైర్డ్ ఉద్యోగి ఆవారి ఆనందంకు నివాళులర్పించారు. వైస్ చైర్మన్ జీనత్ పర్వీన్, మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, డీఈ అరుణ్, టీపీవో శ్రీనివాస్, జేఈవో గణేశ్ పాల్గొన్నారు.


