జగిత్యాల: జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత కేవీ.నరేందర్‌ను 2015 సంవత్సరం ఉత్తమ నవలా రచయితగా తెలుగు విశ్వవిద్యాలయం నిపుణుల కమిటీ ఎంపిక చేసినట్లు వైస్ చాన్స్‌లర్ వెలుదండా నిత్యానందరావు ప్రకటించారు. బర్రె నవలకుగాను పురస్కారం అందించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుండి 12 మంది రచయితలకు ఒక విభాగం కింద పురస్కారం ఇస్తుండగా.. నవలా విభా గంలో నరేందర్‌కు అవార్డు ప్రకటించారు. ఈ నెల 26న నాంపల్లి ప్రాంగణంలోని ఎన్టీరామారావు కళామందిర్‌లో రూ.30,116 తోపాటు పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. గొల్లపల్లి మండలం చిల్వాకోడూరుకు చెందిన నరేందర్ ఇప్పటికే 35 అవార్డులు అందుకున్నారు. నవలా రచయితగా ఇది మొదటి పురస్కారం అందుకుంటున్నారు.
బండరాళ్లు అడ్డువేసి.. నీటిని మళ్లించి
ఇబ్రహీంపట్నం: వేసిన పంటలను కాపాడుకునేందుకు.. గుక్కెడు తాగునీటి కోసం రైతులు, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది నామమాత్రంగా కురిసిన వర్షాలకు మండలంలోని గంగనాల ప్రాజెక్టు కింద సుమారు నాలుగు వేల ఎకరాల్లో మాత్రమే వరిసాగు చేస్తున్నారు. ఆ పంటలను కూడా కాపాడుకునేందుకు సదర్‌మట్ ప్రాజెక్టు నుంచి గేట్ల లీకేజీ ద్వారా వస్తున్న కొద్దిపాటి నీటిని గంగనాల మాటుకాలువకు మళ్లించేందుకు గోదావరిలో బండరాళ్లను అడ్డుగావేస్తున్నారు. చివరి ఆయకట్టుకు నీరు అందేందుకు పూడిక, పిచ్చి మొక్కలను జేసీబీ తో రైతులు తొలగించుకుంటున్నారు. గంగనాల ప్రాజెక్ట్ ఎగువభాగంలో గోదావరిపై సదర్‌మట్ నిర్మించడంతో గంగానాలకు నీరు రావడం కష్టమవుతోంది. దీంతో వేములకుర్తి, యామాపూర్, ఫకీర్‌కొండపూర్ గ్రామాల రైతులు పంటలను కాపాడుకునేందుకు ఇలా అష్టకష్టాలు పడుతున్నారు.


