మల్యాల: ముక్కుపచ్చలారని పసివాడు.. రాత్రి హాయిగా తల్లి ఒడిలోనే నిద్రపోయాడు. వేకువజామునే అమ్మ నిద్ర లేపింది. ఎందుకు లేపిందో తెలియని ఆ పసివాడు అమ్మ చేయిపట్టుకుని ఆమె వెంటే నడిచాడు. ఎటు తీసుకెళ్తుందో తెలియని ఆ చిన్నారి అడుగులు చివరకు కాటివరకు తీసుకెళ్తాయని ఊహించలేకపోయాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే.. కొడుకును బావిలో తోయడం.. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. తాను చనిపోతే తన కొడుకును ఎవరు చూస్తారనుకుందో..? కొడుకు ప్రాణం తీసేందుకు ఆ తల్లి మనసుకు ఎన్ని గాయాలయ్యాయో..? తెలియదుగానీ.. ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని బావిలో తోసిందనే వార్తతో ప్రజల కళ్లు వరదలై పారాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన గుండేటి కవిత, దశరథం భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు నిఖిలేష్ (12), శశాంక్(7) కుమారులు సంతానం. కవిత బీడీలు చుడుతూ.. బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. దశరథం ఉపాధి కోసం ముంబాయి వెళ్లాడు. అప్పటినుంచి కవిత మామ పండిత్, ఇద్దరు కుమారులతో కలిసి గుడిపేట వెళ్లే దారిలో ఉన్న సొంతింట్లో ఉంటోంది.
● అన్నా.. నేను చనిపోతున్నా
కవిత కుటుంబ పోషణకు కొందరి వద్ద అప్పు చేసినట్లు తెల్సింది. ఆ అప్పులకు వడ్డీ చెల్లించే క్రమంలో మరింత అప్పు చేయాల్సి వచ్చింది. అలా అప్పు రూ.20లక్షల వరకు చేరినట్లు సమాచారం. అప్పు ఇచ్చిన వారు చెల్లించాలని కోరుతుండడం.. భర్త డబ్బులు పంపించకపోవడంతో కొన్నాళ్లుగా మనస్తాపం చెందుతోంది. గురువారం వేకువజామున 3.40 గంటలకు కవిత తన సోదరుడు కొమురయ్యకు ఫోన్ చేసి ‘అన్నా నేను చనిపోతున్నా..’ అని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. అనంతరం చిన్న కుమారుడు శశాంక్‌ను వెంటబెట్టుకుని వెళ్లింది. (ఈ చిత్రాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.) నేరుగా గుడిపేట వెళ్లే మార్గంలో ఉన్న వ్యవసాయ బావిలో శశాంక్‌ను తోసి.. తానూ దూకినట్లు తెలుస్తోంది. కవిత ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో కంగారుపడిన కొమురయ్య సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బావుల్లో వెదికాడు. ముత్యంపేట మీదుగా గుడిపేట వెళ్లే మార్గంలో వెదుకుతుండగా.. ఓ వ్యవసాయ బావి వద్ద తల్లీకొడుకుల చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఫైరింజన్, గజ ఈతగాళ్లతో బావిలో గాలిస్తుండగా.. ఉదయమే కవిత మృతదేహం నీటిలో తేలింది. శశాంక్ కోసం రాత్రి వరకూ గాలిస్తూనే ఉన్నా.. ఆచూకీ దొరకలేదు.
● కన్నీమున్నీరైన కుటుంబ సభ్యులు..స్థానికులు
కొడుకును బావిలో వేసి.. తల్లి ఆత్మహత్య చేసుకుందన్న వార్త తెలియడంతో గుడిపేట, ముత్యంపేట, మల్యాలకు చెందిన వందలాదిమంది బావి వద్దకు చేరుకున్నారు. కవిత మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కొడుకును బావి లో ఎందుకు తోసిందో.. అంటూ కన్నీరు పెట్టుకున్నారు. శశాంక్ తరచూ అనారోగ్యం బారిన పడు తుండడంతో తాను చనిపోతే అతడిని ఎవరూ చూ సుకోరని భావించి బావిలో తోసినట్లు తెలుస్తోంది.
రోదిస్తున్న బంధువులు
శశాంక్ కోసం గాలిస్తున్న గ్రామస్తులు
కొడుకును నిద్రలేపి తీసుకెళ్లిన తల్లి
ముందుగా బావిలో తోసి తానూ దూకి..
తల్లి మృతదేహం లభ్యం..
చిన్నారి కోసం గజఈతగాళ్ల గాలింపు
మిస్టరీగా తల్లీకొడుకుల ఘటన


