రయ్‌.. రయ్యంటూ.. | - | Sakshi
Sakshi News home page

రయ్‌.. రయ్యంటూ..

Sep 9 2026 11:57 PM | Updated on Sep 9 2026 11:57 PM

ర్యాంపులు, అండర్‌పాస్‌లు కావాలి

ఎన్‌హెచ్‌ 563పై ట్రయల్స్‌ ప్రారంభం

అక్టోబర్‌ మొదటి వారం నుంచి టోల్‌ వసూళ్లు

దుర్శేడ్‌ నుంచి పెద్దపల్లి, కరీంనగర్‌కు వాహనాల రాకపోకలు

జగిత్యాల– కరీంనగర్‌ సెక్షన్‌కు రూ.9 కోట్లు విడుదల

పలు చోట్ల ట్రాఫిక్‌ అవాంతరాల నియంత్రణకు వెచ్చింపు

జగిత్యాల– కరీంనగర్‌ సెక్షన్‌కు రూ.9కోట్లు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

జాతీయ రహదారి 563పై రాకపోకలు ప్రారంభం అయ్యాయి. 68 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి కరీంనగర్‌– వరంగల్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కేవలం 40 నిమిషాల్లో రెండు నగరాల మధ్య వాహనాలు రాకపోకలు సాగించేలా ఈ రహదారిని నిర్మించిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రహదారి మానకొండూరు సమీపంలోని ఖాదర్‌గూడం వరకు అందుబాటులో ఉండేది. దుర్శేడ్‌ వద్ద ర్యాంపు నిర్మించకపోవడంతో పెద్దపల్లి నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బందిగా మారిందన్న ‘సాక్షి’ కథనంతో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) వారు కరీంనగర్‌– వరంగల్‌ సెక్షన్‌ దుర్శేడ్‌ వద్ద రోడ్డు చివర తాత్కాలిక ర్యాంప్‌ ఏర్పాటు చేశారు. దీంతో వరంగల్‌, పెద్దపల్లి, కరీంనగర్‌కు రాకపోకలు సాగించేందుకు వీలు చిక్కింది. జగిత్యాల– కరీంనగర్‌ సెక్షన్‌ పనులు మొదలయ్యే వరకు ఈ తాత్కాలిక ర్యాంప్‌ మీదుగా రాకపోకలు సాగనున్నాయి. ఈ రహదారిని అత్యంత వేగంగా పూర్తి చేసినందుకు హన్మకొండ కలెక్టర్‌ చేతుల మీదుగా ఎన్‌హెచ్‌–563 ప్రాజెక్టు డైరెక్టర్‌ కీర్తి భరద్వాజ్‌ అవార్డు అందుకోవడం విశేషం. ఇక అక్టోబరు మొదటి వారం నుంచి కొత్తగట్టు వద్ద ఏర్పాటు చేసిన టోల్‌గేట్‌ ద్వారా టోల్‌ చార్జీలు వసూలు చేయనున్నారు.

దుర్శేడ్‌ వద్ద రోడ్డు చివర ఏర్పాటు చేసిన ర్యాంపుతో కరీంనగర్‌–వరంగల్‌– పెద్దపల్లి వెళ్లే వాహనాలకు కాస్త ఊరట లభించింది. రోడ్డు దిగాక.. కరీంనగర్‌ లేదా పెద్దపల్లి వైపు ఎలా వెళ్లాలి? అన్న విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

పెద్దపల్లి నుంచి వచ్చేవారు దుర్శేడ్‌ పద్మనాయక భవనం వద్ద యూటర్న్‌ తీసుకుని ర్యాంపుమీదుగా హైవే ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ వాహనదారులు తికమకపడితే పరస్పరం ఢీకొనే ప్రమాదముంది.

పెద్దపల్లి నుంచి వచ్చే వారికి జగిత్యాల వైపు నిర్మించినట్లుగా శాశ్వత ర్యాంపులు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ రహదారికి శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి వద్ద అండర్‌ పాస్‌లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు స్పందిస్తూ.. తమ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేస్తే తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

దాదాపు రూ.రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో 59 కిలోమీటర్ల ఎన్‌హెచ్‌– 563 జగిత్యాల– కరీంనగర్‌ సెక్షన్‌కు ఇటీవల టెండర్లు పిలిచారు. ఇవి త్వరలోనే ఖరారవనున్నాయి. ఇరుకుగా ఉన్న జగిత్యాల– కరీంనగర్‌ రోడ్డుపై రాకపోకలు అంటే ప్రతీరోజూ ఆర్టీసీ, ప్రైవేటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంగాధర వద్ద రైల్వేగేట్‌తో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు టెండరు ఖరారయ్యేలోగా వాహనదారులకు వీలుగా ఉండేలా ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు సిద్ధపడ్డారు. ఇందుకోసం దాదాపు రూ.9 కోట్లు విడుదల చేశారు. పలుచోట్ల రోడ్ల వెడల్పు, చెట్ల తొలగింపు, స్పీడ్‌ బ్రేకర్లు, ప్రమాదాలు జరిగే చోట సైన్‌ బోర్డులు ఏర్పాటు చేసే పని చేపడుతున్నారు. వరంగల్‌– కరీంనగర్‌ సెక్షన్‌లో పాత రహదారిని ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో 39కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement