వెయ్యి రోజుల్లో అభివృద్ధి శూన్యం | - | Sakshi
Sakshi News home page

వెయ్యి రోజుల్లో అభివృద్ధి శూన్యం

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

రూ.3.5లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారు..?

మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌

గొల్లపల్లిలో ఎడ్లబండ్ల ర్యాలీ

గొల్లపల్లి: కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మండలకేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ముస్కు శ్యాంసుందర్‌ గార్డెన్‌ వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి అడ్లూరి రిపోర్టులు అడగడం మాని, తన పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్‌ హయాంలో కాళేశ్వరం, గురుకులాలు, మెడికల్‌ కాలేజీలు, బస్తీ దవాఖానా ల వంటి ఆస్తులు సృష్టించామని, అయినా అప్పు రూ.3.90లక్షల కోట్లు దాటలేదని, కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనలో ఇప్పటికే రూ.3.5 లక్షల కోట్ల అప్పు చేశారని, వాటితో ఏం చేశారని ప్రశ్నించారు. రైతుభరోసా ఎగ్గొట్టారని, పెన్షన్‌ రూ.నాలుగు వేలు ఇవ్వడం లేదని, మహిళలకు రూ.2500, తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. రోళ్లవాగు ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ 95శాతం పూర్తి చేసినా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం గేట్లు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కపెల్లి చెరువు, దొంతాపూర్‌ రోడ్డు, యశ్వంతరావుపేట చెరువు, మ్యాదరి గండి పనులను పక్కనపెట్టారని ఆరోపించారు. రాయపట్నం, ముత్తురూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ నిర్వహణ గాలికి వదిలేశారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ వసంత, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement