కథలాపూర్(వేములవాడ): మండలంలోని కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం 43,100 ఎకరాలకు సాగునీరందించినట్లయితే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, నీరందించకపోతే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా నామినేషన్ వేయొద్దని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు అన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల అవస్థలపై మండలకేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందరోజుల్లో ఆరుగ్యారంటీలను అమలు చేస్తామని ఆది శ్రీనివాస్ బాండ్ పేపర్ రాసిచ్చారని, రాజన్న ఆలయంలో పెట్టి పూజలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వరదకాలువ నిర్మించింది కాంగ్రెస్ అయినా.. దానిని జీవనదిగా మార్చింది మా త్రం కేసీఆర్ అని, రివర్స్ పంపింగ్ ద్వారా ఈ ప్రాంతానికి నీరు అందించారని పేర్కొన్నారు. రైతులు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, మండల నాయకులు గడ్డం భూమారెడ్డి, మామిడిపెల్లి రవి పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ ఆదికి బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ సవాల్


