టీచర్లకు ‘ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం’ ఉదయం, సాయంత్రం హాజరు తప్పనిసరి సెలవు పెట్టినా యాప్‌లోనే నమోదు లేకుంటే గైర్హాజరే.. జిల్లాలో 782 పాఠశాలలు 4,139 మందికి అమలవుతున్న ఎఫ్‌ఆర్‌ఎస్
గొల్లపల్లి : వేతనం తీసుకుంటూ.. పాఠశాలలకు డుమ్మాకొట్టే కొందరు ఉపాధ్యాయుల తీరుకు ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్)తో బ్రేక్ పడింది. పాఠశాల ప్రాంగణంలోనే నిల్చుని సమయానికి ముఖం చూపిస్తేనే హాజరు నమోదయ్యే సాంకేతికత అమల్లోకి రావడంతో టీచర్లు విధిగా సమయపాలన పాటిస్తున్నారు. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో సిబ్బందిలో మరింత గుబులు మొదలైంది.
జియో ఫెన్సింగ్ పక్కా
జిల్లావ్యాప్తంగా 782 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్న ఎంఈవోలు, ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సీఆర్పీలు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు సహా మొత్తం 4,139 మందిని ఎఫ్‌ఆర్‌ఎస్ పరిధిలోకి తెచ్చారు. ఉపాధ్యాయులతోపాటు బోధనేతర సిబ్బంది కూడా బడి ప్రారంభంలో ఒకసారి, ముగిశాక మరోసారి తమ లొకేషన్ నుంచి ఫొటో క్యాప్చర్ చేయాల్సిందే. పాఠశాల పరిధి దాటి ఇతర ప్రాంతాల్లో ఉండి హాజరు వేస్తామంటే సాంకేతికత అంగీకరించదు. సెలవు తీసుకున్నా ముందస్తుగా యాప్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం రెండు పూటలా హాజరు నమోదు కాకపోతే ఆ రోజు గైర్హాజరు పడటం ఖాయం.
క్షేత్రస్థాయి సిబ్బందిపై తప్పని నిఘా
ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ప్రధానంగా రెండు పద్ధతుల్లో వర్తింపజేస్తున్నారు. టీచర్లు రోజూ వారివారి పాఠశాల ప్రాంగణం నుంచే మొబైల్ ద్వారా నేరుగా ఫేస్ క్యాప్చర్ చేయాలి. ఫీల్డ్ వర్క్‌లో ఉండే ఎంఈవోలు, సీఆర్పీలు తనిఖీలకు వెళ్లిన పాఠశాలలు లేదా అధికారిక సమావేశాలు జరిగే ప్రదేశాల నుంచే తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది.
హాజరుతోనే జీతం
కేవలం హాజరు కోసమే కాకుండా.. రాబోయే రోజుల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ డేటాను నేరుగా ట్రెజరీ వేతన వ్యవస్థకు లింక్ చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. నెలవారీగా ఉపాధ్యాయుడి హాజరు శాతాన్ని లెక్కించి, అనుమతించిన సెలవుల కంటే ఎక్కువ రోజులు విధులకు గైర్హాజరైతే వేతనంలో నేరుగా కోత విధించనున్నారు.
బోధనలో నాణ్యత పెరిగేనా..?
సాంకేతిక నిఘాతో ఉపాధ్యాయుల హాజరు శాతం మెరుగవుతున్నప్పటికీ సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలు ఏ మేరకు పెరుగుతాయనే చర్చ ప్రజల్లో మొదలైంది. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గి, ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్న వేళ.. ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపేలా నిబంధనలు తెస్తేనే బోధనలో నిజమైన జవాబుదారీతనం వస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.


