సహకార పదవులు దక్కేనా? | - | Sakshi
Sakshi News home page

సహకార పదవులు దక్కేనా?

Sep 4 2026 2:00 AM | Updated on Sep 4 2026 2:00 AM

నామినేటెడ్‌ పద్ధతిలో ఎంపికకు ఎమ్మెల్యేల కసరత్తు కొన్ని చోట్ల సభ్యత్వాల పరిశీలన ఆశావహుల పోటాపోటీతో రహస్యంగా ఎంపిక ప్రక్రియ 51 పీఏసీఎస్‌ల్లో రెండు సంఘాలకు చైర్మన్ల నియామకం

జగిత్యాలరూరల్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నామినేటెడ్‌ పద్ధతిలో పదవుల ఎంపికకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైర్మన్ల నియామకం విషయం హైకోర్టులో ఉండటంతో ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు కొనసాగుతోంది. గతంలో మాదిరిగా పీఏసీఎస్‌లో ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం నామినేటెడ్‌ విధానంలో పదవులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలో 51స్థానాలకు మల్యాల మండలం పోతారం, నూకపల్లి సింగిల్‌ విండోలకు చైర్మన్లను నామినేటెడ్‌ పద్ధతిలో నియమించారు. మిగతా 49 స్థానాల్లో నియామకాలు చేపట్టనున్నారు. కొన్నిచోట్ల పాత పాలకవర్గాలు కోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ.. ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా నామినేటెడ్‌ పద్ధతిలో పదవుల ఎంపికకు జాబితా ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహుల జాబితాను ప్రభుత్వానికి అందించారు. పీఏసీఎస్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌, డైరెక్టర్ల పదవులకు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం ఆచీతూచి అడుగులు వేస్తున్నారు.

గడువు తీరి రెండున్నరేళ్లు

జిల్లాలోని పీఏసీఎస్‌లకు చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. వాటి కాలపరిమితి 14 ఫిబ్రవరి 2025తో ముగిసింది. ప్రభుత్వం ఆరునెలల చొప్పున రెండు దఫాలుగా పొడిగించింది. ప్రస్తుతం పర్సనల్‌ ఇన్‌చార్జిలు కొనసాగిస్తున్నారు. పాత పాలకవర్గాలు కొన్ని చోట్ల కోర్టును ఆశ్రయించాయి. ఎన్నికలయ్యే వరకు తమనే పదవిలో ఉంచాలని కోరారు. కోర్టు కూడా పర్సన్‌ ఇన్‌చార్జీలను తొలగించి.. పాత పాలక వర్గాలను కొనసాగించాలని సూచించింది. ప్రభుత్వం మాత్రం నామినేటెడ్‌ పద్ధతిలో పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని ఎమ్మెల్యేల ద్వారా ఆశావహుల జాబితా ను సేకరించింది. పోటీ ఎక్కువగా ఉన్న చోట ఆశావహులను బుజ్జగిస్తూ.. రహస్యంగా ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో గుట్టుగా సంబంధిత సహకార సంఘాల అధికారులను పిలుపించుకొని.. ఎంపిక చేసిన డైరెక్టర్లకు ఆయా సొసైటీ పరిధిలో సభ్యత్వాలు ఉన్నాయా..? లేదా అని ఆరా తీస్తున్నారు. ఎంపిక అభ్యర్థికి తెలి యకుండా గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

సభ్యత్వం తప్పనిసరి

జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో 51 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 83,387 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్కో సంఘంలో 13 మంది డైరెక్టర్లుగా ఉంటారు. ఆ డైరెక్టర్లలో ఆరింటికి రిజర్వేషన్లు ఉంటాయి. రెండు బీసీ, ఒక ఎస్టీ, రెండు ఎస్సీల్లో ఒకటి మహిళ, ఎస్సీ జనరల్‌, మరొకటి జనరల్‌ మహిళా రిజర్వు సీట్లు ఉన్నాయి. 13 మంది డైరెక్టర్లలోనే ఒకరు చైర్మన్‌గా, వైస్‌ చైర్మన్‌గా ఎంపిక చేస్తారు. ఈ పదవులకు ఎంపిక కావాల్సిన వారు కచ్చితంగా ఆ పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పరిధిలో సభ్యత్వం ఉండాల్సి ఉంటుంది.

ప్రభుత్వమే నియమిస్తుంది

సహకార సంఘాల చైర్మన్లను గతంలో ఎన్నికలు నిర్వహించి ఎంపిక చేసేవారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు నామినేటెడ్‌ పద్ధతిలో చైర్మన్ల నియామకానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియామక ప్రక్రియ కొనసాగుతుంది. – మనోజ్‌కుమార్‌, డీసీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement