జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ ముగుస్తున్నా.. భూగర్భజలాలు ఇంకా లోతులోనే ఉన్నాయి. వర్షాలు అంతంతమాత్రంగా కురవడంతో జూలైతో పోల్చితే ఆగస్టు చివరి నాటికి భూగర్భజలం 1.14 మీటర్ల మేర పెరగడం కొంత ఆశాజనకంగా మారింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే 0.86 మీటర్ల లోతులోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
కోరుట్ల మున్సిపాలిటీలో 9.21మీటర్ల లోతుల్లో
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి వంటి పట్టణ ప్రాంతాల్లో రోజువారి అవసరాలకు నీటి వినియోగం పెరగడంతో నీటిమట్టం రోజురోజుకూ పడిపోతుండటం ఇబ్బందిగా మారింది. వరదనీటిని నిల్వ చేయాల్సింది పోను.. ఇష్టానుసారంగా బోరు బావులను తవ్వుతుండడంతో నీటిమట్టం లోతుకు పడిపోతోంది. ఆగస్టులో మున్సిపాలిటీల్లో పడిపోయిన నీటిమట్టాలను పరిశీలిస్తే.. జిల్లాకేంద్రంలో 7.27 మీటర్లు, కోరుట్లలో 9.21 మీటర్లు, మెట్‌పల్లిలో 4.88 మీటర్లు, రాయికల్‌లో 2.89మీటర్లు, ధర్మపురిలో 3.22 మీటర్ల మేర పడిపోయింది.
నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లోనూ అంతంతే..
నాన్‌ఆయకట్టు ప్రాంతాలైన మల్యాల, మేడిపల్లి, కథలాపూర్, కొడిమ్యాల, భీమారం మండలాల్లో భూగర్భజలాలు మరింతగా పడిపోతున్నాయి. నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా తగ్గుతున్నాయి. మల్యాల మండలంలో 7.61మీటర్లు, కొడిమ్యాలలో 13.32మీటర్లు, కథలాపూర్‌లో 2.60 మీటర్లు, మేడిపల్లిలో 6.69 మీటర్లు, భీమారంలో 2.72 మీటర్లకు నీటిమట్టం పడిపోయింది.
ఒక్క నెలలో పెరిగిన భూగర్భజలం
అడపదడపా కురిసిన వర్షాలతో నీటిమట్టం ఒక్క నెలలోనే సగటున 1.14 మీటర్లకు పెరిగింది. జూలైలో 5.61 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఆగస్టు చివరి నాటికి 1.14 మీటర్లు పెరిగి 4.47 మీటర్లకు చేరుకుంది. బీర్‌పూర్ మండలంలో 2.50 మీటర్ల లోతులో నీరు ఉండగా, అత్యధికంగా 13.32 మీటర్ల లోతులో కొడిమ్యాల మండలంలో నీరు ఉండటం గమనార్హం.
ఆయకట్టు మండలాల్లోనూ అంతే..
ఆయకట్టు మండలాల్లోనూ నీటిమట్టం పడిపోతూనే ఉంది. బుగ్గారంలో 3.19 మీటర్లు, ఎండపల్లిలో 7.17, గొల్లపల్లిలో 2.57, జగిత్యాలరూరల్‌లో 2.72, పెగడపల్లిలో 3.62, సారంగాపూర్‌లో 4.64, వెల్గటూర్‌లో 3.26, ఇబ్రహీంపట్నంలో 3.25, మల్లాపూర్‌లో 5.18 మీటర్ల మేర పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తుండటంతో ఈనెలలోనూ భూగర్భజల మట్టం పెద్దగా పెరగకపోవచ్చని చర్చ నడుస్తోంది.
జూలైతో పోల్చితే ఆగస్టులో కొంత ఆశాజనకం
కొడిమ్యాల మండలంలో 13.32 మీటర్లలోనే నీరు


