ఆగిన బూట్ల చప్పుళ్లు మోగని తుపాకులు | - | Sakshi
Sakshi News home page

ఆగిన బూట్ల చప్పుళ్లు మోగని తుపాకులు

Sep 3 2026 4:15 AM | Updated on Sep 3 2026 4:15 AM

మంథని: ఒకప్పుడు పీపుల్స్‌వార్‌ నక్సలైట్ల సంచారం.. ఆ తర్వాత మావోయిస్టుల కదలికలు.. మరోవైపు పోలీసుల కూంబింగ్‌ ఆపరేషన్లు.. ఎదురుకాల్పులు.. తుపాకుల మోతలతో దద్దరిల్లిన కరీంనగర్‌ తూర్పు ప్రాంతంలోని అడవులు ప్రస్తుతం ప్రశాంత వాతావరణం సంతరించుకున్నాయి. దశాబ్దాల పాటు హింస, రక్తపాతం, భయాందోళనలకు వేదికగా నిలిచిన అడవుల్లో మారిన పరిస్థితులు కొత్తఆశలకు బాటలు వేస్తున్నాయి. తెలంగాణలోనే విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న మంథని నియోజకవర్గంలో 120 కిలోమీట్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. మావోయిస్టు పార్టీల్లోని కేంద్ర కమిటీ సభ్యులు, దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మహిళల ఎన్‌కౌంటర్లు, నక్సల్స్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఓ పెద్దస్థాయి పోలీస్‌ అధికారి.. ఇలా అనేక ఘటనలకు తూర్పు అడవులు సాక్ష్యంగా నిలిచాయి. అలాంటి అడవులు ఇప్పుడు నిశబ్దంగా మారాయి.

మౌనంగా భరించిన అడవితల్లి

అడవితల్లి అన్నింటినీ మౌనంగా భరరించింది. తుపాకీ గుళ్ల శబ్దాలు విన్నది. రక్తపు మరకలు చూసింది. పరుగులు తీసిన బూట్లను చూసింది. ఎన్‌కౌంటర్ల తర్వాత నెలకొన్న నిశబ్దాన్నీ అనుభవించింది. పరిస్థితులు మారడంతో సాయుధులు సంచరించిన ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం వెళ్లే అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మికులు కనిపిస్తున్నారు,.

జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోవు

దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలో జరిగిన అనేక జ్ఞాపకాలు చెరిగిపోలేదు. అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, మావోయిస్టులు, సామాన్యులు వారి కుటుంబాల విషాద గాథలు ఇప్పటికీ జ్ఞాపకాల్లో ఉన్నాయి. గతాన్ని గుర్తు చేస్తున్నా.. భవిష్యత్‌పై ఆశలు కలిగిస్తున్నాయి. ఏదీ ఏమైనా అలజడులతో అట్టుడికిన తూర్పు అడవులు ఇప్పుడు ఆహ్లాదం పంచుతున్నాయి.

రక్తసిక్తమైన అడవితల్లి నేడు నిశబ్దం

పీపుల్స్‌వార్‌ నుంచి మావోయిస్టు పోరాటం వరకు ..

దశాబ్దాల హింసకు తెరపడుతున్న వేళ

మారిన తూర్పు అడవుల ముఖచిత్రం

రక్తపుటేరులైన అడవులు

పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన అనేక ఎదురుకాల్పులు ఈ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. తుపాకీ కాల్పులతో దద్దరిల్లిన సందర్భాలు అనేకం. ఇరువైపులా ప్రాణనష్టం సంభవించేది. ఈ ఘర్షణల మధ్య అడవిని నమ్ముకుని జీవించే సామాన్యులే తీవ్రంగా నష్టపోయారు. ఓవైపు తమ వారిని కోల్పోయిన కుటుంబాల కన్నీళ్లు.. మరోవైపు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలతో గడిపిన గిరిజన కుటుంబాలు.. ఇలా అనేక విషాదాలకు అడవులు సాక్ష్యంగా నిలిచాయి. పరిస్థితులు మారాయి. మావోయిస్టు ఉద్యమం క్రమంగా బలహీనపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన నిరంతర భద్రతా చర్యలు, ఆపరేషన్లతో అనేక ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోవడం, మరికొందరు ఉద్యమానికి దూరం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అప్పుడు భయం.. ఇప్పుడు పక్షుల కిలకిలరావాలు

ఇప్పుడు అక్కడ బూట్ల చప్పుళ్లు వినిపించడం లేదు. తుపాకుల మోత లేదు. కూంబింగ్‌ బృందాల హడావుడి లేదు. ఎన్‌కౌంటర్‌ భయం లేదు. పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. చెట్ల ఆకులను తాకుతూ గాలి వెళ్తోంది. అడవిని నమ్ముకుని జీవించే ప్రజలు దైనందిన జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. నేల శాంతి కోసం ఎదురుచూస్తోంది. ఈ నిశబ్దం వెనుక ఒక సుదీర్ఘమైన విషాద చరిత్ర ఉంది. అనేక ప్రాణాలు పోయాయి. చాలా కుటుంబాలు ఆప్తులను కోల్పోయాయి. అనేకమంది తల్లులు కన్నీటితో కాలం గడిపారు. చాలామంది పిల్లలు తండ్రి కోసం ఎదురుచూశారు. అనేక గిరిజన కుటుంబాలు భయంతో బతికాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కాలగర్భంలో కలిసిపోయినా.. ఆ అడవులకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. అందుకే నేడు అడవితల్లి మూగపోలేదు.. మౌనంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement