క్వింటాల్‌కు రూ.500 ప్రోత్సాహకం ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాలకే వర్తింపు ఈనెల 10 లోపు వివరాలు నమోదు చేసుకోవాలి
గొల్లపల్లి: వరి సాగులో చెమటోడ్చే అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం సన్న రకాలకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం దక్కనుంది. వ్యవసాయ శాఖ నిర్దేశించిన ఏడు రకాల సన్న వడ్లకే ఈ బోనస్ వర్తిస్తుందని, రైతులు ఈనెల 10లోగా తమ వివరాలను పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
డీలర్ల వద్ద తప్పనిసరి నమోదు
సన్న రకాల విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఆయా డీలర్ల వద్దే ‘సీడ్ సేల్స్ మేనేజ్‌మెంట్ సిస్టం’ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆధార్‌కార్డు, పట్టాదార్ పాస్‌బుక్ నంబర్‌తోపాటు విత్తనాలు కొనుగోలు చేసిన అధికారిక రశీదులు (బిల్లులు) సమర్పించాల్సి ఉంటుంది. కౌలు రైతులు కూడా విత్తన బిల్లులు, సాగు చేస్తున్న భూమి వివరాలు తెలిపి డీలర్ల వద్ద నమోదు చేయించుకోవచ్చు.
సొంత విత్తనాలు వాడితే ఏఈవోల పరిశీలన
దుకాణాల్లో కాకుండా సొంత విత్తనాలు వినియోగించినా లేదా ఇతరుల వద్ద నుంచి విత్తనాలు తెచ్చుకుని సాగు చేసినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అలాంటి రైతులు వెంటనే సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. సాగు విస్తీర్ణం, రకం వివరాలతో కూడిన స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తారు.
బోనస్ లభించే ఏడు సన్న రకాలివే..
తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 15048)
సాంబమసూరి (బీపీటీ 5204)
కేఎన్‌ఎం 1638
డబ్ల్యూజీఎల్ 44
కేఎన్‌ఎం 7715
హెచ్‌ఎంటీ సోనా
హెచ్‌ఎంటీ జై శ్రీరామ్


