పెగడపల్లి: గ్రామీణ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా పీహెచ్‌సీ, ఇతర వైద్యశాలలకు అందించే నిధులు మూడేళ్లుగా జాడలేకుండా పోయాయి. ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్‌ల పదవీకాలం ముగిసిన ఏడాది నుంచి పీహెచ్‌సీల అభివృద్ధి కమిటీలు లేకుండా పోయాయి. కమిటీలున్న సమయంలో కనీసం ఆస్పత్రుల నిర్వహణ నిధుల గురించి ప్రస్తావించేది. జిల్లాలోని వివిధ మండలాల గ్రామీణ ప్రభుత్వ ఆస్పత్రులకు రోజుకు కనీసం 50 నుంచి 100 మంది ప్రజలు వచ్చి పరీక్షలు చేసుకుంటున్నారు. నిధులు లేక వారికి కావాల్సిన సేవలు అందించడం కష్టంగా మారింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో పని చేస్తున్న పర్మినెంట్ డాక్టర్లు ఎంతోకొంత ఖర్చు చేస్తున్నప్పటికీ ఒప్పంద డాక్టర్లున్న చోట ఖర్చు చేసేందుకు ముందుకు రావడం లేదు. 2024 నుంచి ఆస్పత్రులు నిర్వహణ అస్తవ్యస్తంగా తయారై కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చీపుర్లు, బకెట్లు, ఇంటర్నెట్, కంప్యూటర్ల మరమ్మతుకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిధులు నిలిచిపోవడంతో ఏ చిన్న అవసరమున్న ఏదైనా వస్తువు కొనాలన్నా వైద్యుల జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తొందని వాపోతున్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సివిల్ ఆస్పత్రులకు ఏటా ప్రభుత్వం నిర్వహణ నిధుల కింద రూ.1.50 లక్షల చొప్పున మంజూరు చేసేది. 2024 తరువాత ఈ నిధులు ఆగిపోయాయి. గతంలో ఈ నిధులు ద్వారా ఆస్పత్రి అభివృద్ధి కమిటీల తీర్మానం మేరకు సదుపాయాలు సమకూర్చేవారు. ప్రస్తుతం పెరుగుతున్న వైద్య అవసరాలు, రోగుల తాకిడికి అనుగుణంగా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
– భారంగా మారిన నిర్వహణ
పీహెచ్‌సీలు 17
అర్బన్ హెల్త్ సెంటర్లు 5
వైద్య విధాన పరిషత్ 1
కమ్యూనిటి హెల్త్ సెంటర్లు 3
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి 1
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు 115
ఎంఎల్‌హెచ్‌సీ డాక్టర్లు 110
నిర్వహణ భారంగా మారింది
ఆస్పత్రి అభివృద్ధి ఫండ్ రాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. నిధుల మంజూరు విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఏదైనా అవసరం పడితే సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. నెలనెలా ఆస్పత్రి అభివృద్ధి నిధులు విడుదల చేస్తే సౌకర్యాలు కల్పించే అవకాశముంటుంది.
– నరేశ్ వైద్యాధికారి పెగడపల్లి


