ఇల్లంతకుంట(మానకొండూర్): హామీ నెరవేర్చాలని కోరుతూ ప్రతీ నెల నిరసనలు చేపట్టిన బీజేపీ కార్యకర్తలు 55 మంది ఆ కేసులో బుధవారం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి జిల్లెల్ల నుంచి డబుల్ రోడ్డు, 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని 2018, మే 16న అప్పటి మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 2020 వరకు పనులు ప్రారంభం కాకపోవడంతో ఆ సమయంలో ఇల్లంతకుంట బీజేపీ మండల అధ్యక్షుడిగా ఉన్న బెంద్రం తిరుపతిరెడ్డి, పార్టీ కార్యకర్తలతో కలిసి 2020, మే 16న మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నిరసన చేపట్టారు. అప్పటి నుంచి ప్రతీ నెల మే 16న 36 నెలల పాటు నిరసనలు చేపట్టారు. ప్రతీసారి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులకు సంబంధించి బుధవారం జిల్లా కోర్టుకు మండలానికి చెందిన 55 మంది అప్పటి బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన వారిలో బత్తిని సాయిగౌడ్, బత్తిని స్వామి, అమ్ముల అశోక్, కొలనూరి ముత్తవ్వ, ప్రసన్న, నాగరాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
36 నెలలపాటు ప్రతీ నెల నిరసన
బీజేపీ కార్యకర్తలపై పోలీసుల కేసు
కోర్టుకు హాజరు


