ఎస్సీ, ఎస్టీలకు పథకాలు అందించండి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీలకు పథకాలు అందించండి

Sep 2 2026 2:58 AM | Updated on Sep 2 2026 2:58 AM

సబ్‌ప్లాన్‌ నిధులు పూర్తిస్థాయిలో వినియోగించాలి

పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

జగిత్యాల: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమంపై మంగళవారం అధికారులతో సమీక్షించారు. కులధ్రువీకరణ పత్రాలను జాప్యం లేకుండా జారీచేయాలని ఆదేశించారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం, ఆదర్శ వివాహ ప్రోత్సాహకాలు త్వరలోనే వస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ఎంత పరిహారం అందించారు..? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని అడిగి తెలుసుకున్నారు. ఎస్‌డీఎఫ్‌, సీడీపీ, ఎంపీ ల్యాడ్స్‌ ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గ్రామాలకు కేటాయించాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.2500 కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

పదోన్నతుల్లో రిజర్వేషన్లు తప్పనిసరి

ఔట్‌సోర్సింగ్‌ నియామకాల్లో రిజర్వేషన్‌, రోస్టర్‌ తప్పనిసరిగా పాటించాలన్నారు. బల్దియా పారిశుధ్య కార్మికులకు రూ.30 లక్షల బీమా కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని, వీబీజీరాంజీ కింద ప్రతిపాదనలు పంపించాలన్నారు. అట్రాసిటీ కేసుల్లో శిక్షల శాతం పెంచాలని, బాధితులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని తెలిపారు. అట్రాసిటీ బాధితుల్లో ఐదుగురికి ఉద్యోగాలు కల్పించినట్లు అదనపు కలెక్టర్‌ లత తెలిపారు. జిల్లాలో 85 ఆదర్శ వివాహ ప్రోత్సాహక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం రూ.2.42 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 185 మంది బాధితులకు రూ.1.06 కోట్లకుపైగా పరిహారం విడుదలైందని తెలిపారు. పీఎం అజయ్‌ పథకం కింద 144 యూనిట్లు గ్రౌండింగ్‌ కాగా.. మరో 30 యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఏఎస్పీ చేతన్‌ నితిన్‌ మాట్లాడుతూ.. 973 ఎస్సీ, 138 ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వీటిలో 870 కేసుల్లో ట్రూ ఎఫ్‌ఐఆర్‌ ఫైనలైజ్‌ కాగా.. 787 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, కమిషన్‌ సభ్యులు రాంబాబునాయక్‌, లక్ష్మీనారాయణ, ప్రవీణ్‌, ఆర్డీవోలు, డీఎస్పీలు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ కిశోర్‌ పాల్గొన్నారు. అంతకుముందుగా బక్కి వెంకటయ్యకు అదనపు కలెక్టర్‌ లత పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement