కోరుట్ల: కోరుట్ల మండలం నాగులపేటలో శనివారం జరిగిన ఓ పెళ్లి భోజనం తిని సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. నాగులపేటకు చెందిన అబ్బాయి, మేడిపల్లి మండలం కల్వకోటకు చెందిన అమ్మాయి పెళ్లి నాగులపేటలో జరిగింది. ఇందులో మటన్, చికెన్, శాకాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ భోజనం చేసిన కొంతమంది వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. సాయంత్రం వరకు మరికొందరికి ఇదే రీతిలో వాంతులు కావడంతో కలవరపడ్డారు. రాత్రి ఏడు గంటల సమయంలో బాధితులు సుమారు 20మంది కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. వైద్యులు వారిని పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.


