రాజారాంపల్లె | - | Sakshi
Sakshi News home page

రాజారాంపల్లె

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

● ప్రభుత్వ ఉద్యోగాల్లో 40మంది● ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్న 50 మంది ● గ్రామాభివృద్ధికి ఆర్థిక సాయం ● ఇతర గ్రామాలకు ఆదర్శం

ఉద్యోగుల ముల్లె..

కేవలం ఉద్యోగాలు చేయడమే కాదు.. పుట్టిన ఊరిపై మమకారాన్ని చాటుకుంటున్నారు. గ్రామంలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు తమవంతు సహాయం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడిన వారు గ్రామ అభివృద్ధికి ముందు వరసలో ఉంటున్నారు. గ్రామానికి చెందిన ఏలేటి వంశీయులు 25మంది వరకు సాఫ్ట్‌వేర్‌రంగంలో ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడ్డారు. పుట్టిన ఊరిపై మమకారంతో గ్రామ పంచాయతీ కార్యాలయం మొదలు వివిధ అవసరాలకు సొంత భూమి ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన ఎండపల్లి మండలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకూ రూ.కోట్లు విలువ చేసే భూమి ఇవ్వడానికి ముందుకు రావడం గమనార్హం.

పల్లెను ప్రపంచానికి పరిచయం చేసి..

గ్రామానికి చెందిన యువ డెవలపర్‌ సిరుమల్ల మణికంఠ యాపిల్‌ సంస్థ నిర్వహించే ప్రతిష్టాత్మక వరల్డ్‌ వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొని రాజారాంపల్లె గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచానికి పరిచయం చేశారు. యాపిల్‌ సంస్థ ఏటా నిర్వహించే ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుంచి రెండువేల మంది డెవలపర్స్‌ను ఎంపిక చేయగా.. అందులో మణికంఠ ఒకరు. ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో మణికంఠ 2025 జనవరిలో అమెరికాలోని మేరీల్యాండ్‌ రాష్ట్రంలో ఉన్న యూఎంబీసీ యూనివర్సిటీలో ఎంఎస్‌ ఇన్‌ డాటా సైన్స్‌ కోర్సులో చేరారు. చదువుతోపాటు సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి సారించిన ఆయన.. రెప్‌ట్రాక్‌ ప్రో అనే వినూత్న యాప్‌ను అభివృద్ధి చేశారు. ఏప్రిల్‌లో యూఎంబీసీ లోని అలెక్స్‌ బ్రౌన్‌ సెంటర్‌ ఫర్‌ ఎంట్రప్రెనూర్‌షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక కాంగియాలసీ బిజినెస్‌ ఇన్నోవేషన్‌ కాంపిటిషన్‌లో మణికంఠ రూపొందించిన రెప్‌ట్రాక్‌ ప్రో యాప్‌ ఉత్తమ వినూత్న యాప్‌గా ఎంపికై ంది. ఈ యాప్‌ అభివృద్ధికి ఆయనకు 4,000 అమెరికన్‌ డాలర్ల మొదటి బహుమతి లభించింది.

యువతలో పోటీతత్వం

యువతలో పోటీతత్వం పెరిగింది. 2003 నుంచి 2020 వరకు సైన్యంలో పనిచేశాను. ఉద్యోగ విరమణ అనంతరం పోటీ పరీక్ష రాసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ప్రజలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్‌ కొలువు కొట్టాను. ఇప్పుడు మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాను.

– చిట్టిమల్ల శ్రీనివాస్‌, కానిస్టేబుల్‌

వ్యవసాయ కుటుంబం నుంచి

మాది వ్యవసాయ కుటుంబం. చిన్ననాటి నుండే నాకు ఏదైనా సాధించాలనే తపన ఉండేది. పాఠశాల, కళాశాలలో టీచర్ల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించాను. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. చదువు మాత్రమే మన మంచి భవిష్యత్తుకు ఽఆధారం.

– హరిశేఖర్‌, ట్రాఫిక్‌ ఎస్సై, గోదావరిఖని

వెల్గటూర్‌: పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు.

ఊరిలో ఐదారుగురు ఉద్యోగులు ఉండడం మహా గొప్ప. అయితే ఆ గ్రామంలో మాత్రం ఏకంగా 40మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వారంతా వివిధ హోదాల్లో పనిచేస్తూ.. యువతలో పోటీతత్వాన్ని పెంచుతున్నారు. ఎస్సైలు ఇద్దరు, కానిస్టేబుళ్లు 12 మంది, టీచర్లు 16 మంది, పంచాయతీ కార్యదర్శులు ఇద్దరు, లెక్చరర్లు ఒక్కరు కొనసాగుతున్నారు. ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ రంగంలో మరో యాభై మంది వరకూ ఉన్నారు. వీరిలో విదేశాల్లో స్థిరపడిన వారు 25 మంది వరకు ఉన్నారు. హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు స్థిరపడిన వారు 15 మంది ఉన్నారు. ఒకరిని చూసి మరొకరు పోటీపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి గ్రామస్తులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement