● సురభి ఫాం హౌస్‌ వేదికగా.. ● అసమ్మతివాదుల సమావేశం ● కీలక నేతల హాజరు | - | Sakshi
Sakshi News home page

● సురభి ఫాం హౌస్‌ వేదికగా.. ● అసమ్మతివాదుల సమావేశం ● కీలక నేతల హాజరు

Aug 30 2026 12:03 AM | Updated on Aug 30 2026 12:03 AM

● సురభి ఫాం హౌస్‌ వేదికగా.. ● అసమ్మతివాదుల సమావేశం ● కీలక నేతల హాజరు

కోరుట్ల: ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే జగిత్యాల బీజేపీలో ముసలం మొదలైంది. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీరుపై ఇన్నాళ్లు అంతర్గతంగా కొనసాగిన అసమ్మతి నాయకులంతా కలిసికట్టుగా కదిలారు. మల్లాపూర్‌ మండలం సాతారం–రేగుంట సమీపంలోని సురభి ఫాంహౌస్‌ వీరికి వేదికగా మారింది. శనివారం మధ్యాహ్నం బీజేపీ అసంతృప్తి నేతలంతా కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

అసంతృప్త నేతల కీలక కలయిక..

ఎంపీ అర్వింద్‌పై కొంతకాలంగా అసమ్మతితో ఉన్న నేతలు మోరపల్లి సత్యనారాయణరావు, సురభి నవీన్‌, రవీందర్‌రెడ్డి, ఇందూరి సత్యం, సీపెల్లి రవీందర్‌, ఏసీఎస్‌.రాజు, లింగంపేట శ్రీనివాస్‌, కోరుట్లకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, కొంతమంది సర్పంచులు, రాచమడుగు శ్రీనివాస్‌రావు, మాజీ కౌన్సిలర్‌ పెండెం గణేశ్‌, మరికొంత మంది పాల్గొన్నారు. వీరితో పలు మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సమావేశంలో పాల్గొనడం గమనార్హం. కీలక నేతలంతా అర్వింద్‌ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమావేశం. కీలక నాయకులతోపాటు సుమారు 400 మంది రెండో శ్రేణికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేపీ ముద్దు.. అర్వింద్‌ వద్దు

కొంతకాలంగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎంపీ అర్వింద్‌ పార్టీకి కొత్త జవసత్వాలు తెస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ సీనియర్‌ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. మొదటి నుంచి పార్టీలో ఉంటూ పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న వారిని కించపరుస్తున్నారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రాణం ఉన్నంతకాలం పార్టీకే పనిచేస్తామని, అదే సమయంలో పార్టీకి నష్టం చేస్తున్న ఎంపీ వెంట ఉండబోమని కీలక నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలను ప్రోత్సాహిస్తూ పార్టీ కీలక నేతల మనోభావాలను గుర్తించకపోవడంపై పలువురు నేతలు ఎంపీ అర్వింద్‌పై ధ్వజమెత్తినట్లు సమాచారం. మొత్తంగా ఈ సమావేశం బీజేపీలో వర్గపోరుతోపాటు రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠకు తెరలేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement