రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడులు | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడులు

Aug 28 2026 1:39 AM | Updated on Aug 28 2026 1:39 AM

ఇబ్రహీంపట్నం: మండలంలోని గోదూర్‌లోగల శ్రీలక్ష్మీవేంకటేశ్వర రైస్‌మిల్లుపై గురువారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 2022 – 23కు సంబంధించిన వానాకాలం ధాన్యం 4418.663 టన్నులు, యాసంగికి సంబంధించిన 208.963 టన్నుల ధాన్యం (సుమారు రూ.10కోట్లు) అమ్ముకున్నట్లు తనిఖీల్లో వెలుగుచూసింది. తదుపరి చర్యల నిమిత్తం కలెక్టర్‌కు నివేదిక పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిల్లును అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో యజమాని రాజేందర్‌ అందుబాటులో లేకపోవడం గమనార్హం. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, సివిల్‌ సప్లయ్‌ డిప్యూటీ తహసీల్దార్‌లు ఉమాపతి, సుమన్‌, ఇన్‌స్పెక్టర్‌లు రాజేందర్‌రావు, నర్సింహస్వామి, జీపీవో లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

కొండగట్టులో ఎన్నికల స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ పూజలు

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని ఎన్నికల సంఘం స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ప్రసూనాంభ గురువారం దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించారు. అర్చకులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఆర్డీవో మధుసూదన్‌ ఆలయ అధికారులు సునీల్‌కుమార్‌, రాజేందర్‌రెడ్డి, మల్యాల తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ తిరుపతి పాల్గొన్నారు.

గ్రామసభల ద్వారా అభ్యంతరాల స్వీకరణ

జగిత్యాలరూరల్‌: ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా సవరణపై గ్రామసభల ద్వారా అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం నర్సింగాపూర్‌లో నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. కొత్త ఓటరు నమోదు, తొలగింపు, సవరణలు, బదిలీలపై అభ్యంతరాలపై గ్రామసభల్లో సూచనలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, రూరల్‌ తహసీల్దార్‌ హకీం, డిప్యూటీ తహసీల్దార్‌ భూమయ్య, ఆర్‌ఐ శంషోద్దీన్‌, సర్పంచ్‌ కుక్కునూరి వంశీ పాల్గొన్నారు.

ఇప్పపల్లిలో గోదాం ప్రారంభం

కథలాపూర్‌: రైతుల ఆర్థికాభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని ఇప్పపల్లిలో నిర్మించిన 500 టన్నుల సామర్థ్యం గల గోదాంను ప్రారంభించారు. సహకార సంఘాలను బలోపేతం చేయడానికి మాజీ సీఎం వైఎస్‌.రాజశేఖర రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను ఒకొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. వేములవాడ – కోరుట్ల మధ్య మూడు లైన్‌ల రోడ్డు విస్తరణకు రూ.150 కోట్లు మంజూరు చేశామన్నారు. మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, తహసీల్దార్‌ రాజమహ్మద్‌, ఎంపీడీవో శంకర్‌, సీఈవో విజయ్‌, నాయకులు పాల్గొన్నారు.

రైస్‌మిల్లు యజమానుల అరెస్ట్‌

కొడిమ్యాల: సీఎంఆర్‌ అప్పగింతలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల మేరకు మండలంలోని శ్రీరాములపల్లిలోగల అమృత ఆగ్రో ఇండస్ట్రీ, హరిహర ఆగ్రో ఇండస్ట్రీ యజమానులను విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారులు అరెస్ట్‌ చేయించారు. ముక్క గంగాధర్‌, ముక్క గోదావరి, ముక్క శ్రీనాథ్‌, ముక్క రవీందర్‌, సమ వజ్రమ్మ, ముక్క సుజాత, ముక్క లక్ష్మి, సామ మారుతిపై బుధవారమే కేసు నమోదు కాగా గురువారం గంగాధర్‌, గోదావరి, వజ్రమ్మ, మారుతిని అరెస్ట్‌ చేసి వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని ఎస్సై నరేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement