రాజన్నకు బంగారు గొలుసు | - | Sakshi
Sakshi News home page

రాజన్నకు బంగారు గొలుసు

Aug 4 2026 12:47 AM | Updated on Aug 4 2026 12:47 AM

● రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

వేములవాడ: పట్టణంలోని బ్రహ్మంగారివీధికి చెందిన విద్యాసాగర్‌–సురేఖ దంపతులు రాజన్నకు రూ.3.50 లక్షల విలువైన బంగారు గొలుసును సోమవారం ఆలయ ఈవో రమాదేవి, అధికారులకు అందజేశారు. దాతలకు దేవస్థానం తరఫున అధికారిక రసీదును జారీ చేసి విరాళం స్వీకరించారు. ఆలయ డీఈవో నవీన్‌కుమార్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

రూ.30 లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణం

కథలాపూర్‌(వేములవాడ): మండలంలోని ఇప్పపెల్లికి చెందిన అతికెం ధనుంజయ్‌(55) రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ధనుంజయ్‌ గతేడాది నవంబర్‌ 11న బైక్‌పై పెట్రోల్‌బంక్‌కు బయల్దేరాడు. రోడ్డు దాటుతుండగా కారు వచ్చి ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలైన ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. సుమారు 8 నెలలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందగా రూ.30 లక్షల వరకు ఖర్చయినట్లు బంధువులు తెలిపారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతిచెందినట్లు పేర్కొన్నారు. ధనుంజయ్‌కి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్‌ తెలిపారు.

కానిస్టేబుల్‌ రాసలీలలు.. సస్పెన్షన్‌

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ఓ మహిళతో కానిస్టేబుల్‌ రాసలీలలపై జిల్లా పోలీస్‌ అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. ముస్తాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్‌, ఓ మహిళతో చనువుగా ఉన్నాడు. సిద్దిపేట జిల్లా రాజక్కపేట శివారులో సదరు మహిళతో కానిస్టేబుల్‌ సన్నిహితంగా ఉండగా గమనించిన రైతు వీరిని ప్రశ్నించాడు. పంట పొలాల్లో ఈ పాడు పనిలేమిటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కానిస్టేబుల్‌ సదరు రైతును బెదిరించడంతో.. ఆ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో జిల్లా పోలీస్‌ అధికారులకు చేరడంతో క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. అయితే ఈ వీడియో పక్షం రోజుల క్రితం తీసిందని చర్చ సాగుతోంది. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ వివాహేతర సంబంధం కొనసాగించడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉంటు హద్దులు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ముస్తాబాద్‌ ఠాణాలో గతంలో పనిచేసిన మరో ఇద్దరు కానిస్టేబుళ్ల అక్రమ వ్యవహారాలపై కూడా విచారణ సాగుతున్నట్లు సమాచారం.

మూడోసారి మింగేసిన మద్యం మత్తు

పెద్దపల్లి: మద్యం మత్తులో ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కనుకుల గ్రామానికి చెందిన ముత్యాల రాజగోపాల్‌(36) మూడోసారీ యత్నించడంతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా చనిపోయి కనిపించడంతో బోరుమన్నారు. మద్యం తాగొద్దని కుటుంబ సభ్యులు వినక పోగా.. ఆ మత్తులో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు వారించడంతో బతికిపోయాడు. కానీ, మద్యం మానేయలేదు. సోమవారం మద్యం తాగి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మత్తులో ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చంద్రకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement